డార్లింగ్ ప్రభాస్ వ్యక్తిగత జీవితం ఎప్పటికప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆయన పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభాస్ పెళ్లి గురించి పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తూ వస్తుండగా, తాజాగా ‘అన్‌స్టాపబుల్ 4’ షోలో ఈ అంశంపై మరింత ఉత్కంఠ పెరిగింది. బాలకృష్ణ, రామ్ చరణ్ మధ్య జరిగిన ఓ సరదా చర్చలో ప్రభాస్ పెళ్లి సంబరాలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు బయటపడ్డాయి.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతితో ప్రభాస్ సంబంధం కుదిరిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. షోలో బయటపడిన వివరాల ప్రకారం, ఈ శుభవార్త త్వరలోనే ప్రభాస్ స్వయంగా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. పేరు, కుటుంబం వంటి వివరాలు గోప్యంగా ఉంచినా, ఈ వార్త ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. జనవరి 14న టెలికాస్ట్ కానున్న ‘అన్‌స్టాపబుల్’ రెండో ఎపిసోడ్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రభాస్ పెళ్లి జరిగినట్లయితే, అది టాలీవుడ్‌లోనే కాక, బాలీవుడ్ స్థాయిలో కూడా గ్రాండ్ ఈవెంట్ అవుతుందన్న మాట నిర్ధారణగా ఉంది. అభిమానులకు ప్రసిద్ధి చెందిన ఆయన బిగ్ హార్ట్, ఆతిధ్యం ఈ పెళ్లి వేడుకను మరింత వైభవంగా మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే బాహుబలి, కల్కి వంటి సినిమాలు భారతీయ సినిమా స్థాయిని పెంచగా, ప్రభాస్ వివాహం తెలుగు సినీ ప్రపంచానికి మరో పండుగలా మారవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో అని, అధికారిక ప్రకటన కోసం అందరూ వేచి చూస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ పెళ్లి సీజన్ టాలీవుడ్‌లో అసాధారణమైన ఉత్సాహం తీసుకురావడం ఖాయం.