రాజకీయాలన్నాక పార్టీ ఫిరాయింపులు లేకపోతే మజా ఏముంటుంది.? అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎవరు అధికారంలో వున్నా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాల్సిందే. ప్రత్యర్థి పార్టీల్ని దెబ్బ కొట్టాలంటే అధికార పార్టీ వద్దనున్న బలమైన అస్త్రం పార్టీ ఫిరాయింపు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. అప్పట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పుకున్నారుగానీ, దానికి ఆమోదం లభించలేదాయె.
అసలు స్పీకర్ ఫార్మాట్‌లో రేవంత్ రాజీనామా చేయలేదన్న విమర్శలున్నాయనుకోండి. అది వేరే చర్చ. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళని రాళ్ళతో కొట్టాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిగ్గూ ఎగ్గూ లేకుండా పార్టీ ఫిరాయించారంటూ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి దూకేసిన నేతల మీద విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. అంతేనా, పార్టీ ఫిరాయింపుల్ని చూసీ చూడనట్టు వదిలేయడం వల్లే తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూధనాచారికి ప్రజా క్షేత్రంలో ఘోర పరాజయం ఎదురయ్యిందని, అదే పరిస్థితి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా వస్తుందని రేవంత్ రెడ్డి శాపనార్థాలు పెట్టేయడం గమనార్హం.
న్యాయ పోరాటం చేస్తాం.. అవసరమైతే సుప్రీంకోర్టుకీ వెళతాం.. స్పీకర్ మీద కూడా చర్యల కోసం ప్రయత్నిస్తామంటూ.. రేవంత్ ఊకదంపుడు ప్రసంగాలిచ్చేశారు. రేవంత్ రాజకీయ గురువు.. చంద్రబాబు, 2014 నుంచి 2019 వరకు ఏం చేశారట.? అప్పట్లో అది రైటు.. ఇప్పుడు అదే రాంగ్ అనుకోవాలేమో.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడూ పార్టీ ఫిరాయింపులు జరిగాయి. అప్పట్లో టీఆర్ఎస్‌ని దెబ్బ కొట్టడానికి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసింది కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే.