వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంతో ఒక్కసారిగా విపక్షాల్లో తీవ్ర ఆందోళన కనిపించింది. దాదాపు అన్ని విపక్షాలూ రఘురామ అరెస్టుని తీవ్రంగా ఖండించేశాయి. జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. టీడీపీకి చెందిన చాలామంది ముఖ్య నేతలు రఘురామ అరెస్టుపై మండిపడ్డారు. బీజేపీ కూడా ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ టోన్ ప్రదర్శించింది. ఎందుకిలా.? రఘురామ, వైసీపీ ఎంపీ. ఆ పార్టీకి కొంతకాలంగా దూరంగా వుంటున్నారు. సొంత పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మధ్య మరీ హద్దులు మీరాయి ఆయన రచ్చబండ కార్యక్రమాలు. దాంతో, ఏపీ సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేసింది. అరెస్టుకి సంబంధించిన కారణాల్ని కూడా వెల్లడించింది ఏపీ సీఐడీ. ఇక, ఇప్పుడు వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళినట్లే. కోర్టు ఏం చెబుతుంది.? అన్నది కాస్సేపట్లో తేలిపోతుంది. రాజకీయాల్లో ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలోనూ చూశాం.. ఇప్పుడూ చూస్తున్నాం.
టీడీపీకి ఈ తరహా వేధింపులు కొత్త కాదు.. టీడీపీ హయాంలోనే ప్రత్యర్థులపై ఎలా కక్ష సాధింపు చర్యలు జరిగాయో చూశాం. అలాంటి టీడీపీ, ఇప్పుడు రఘురామ విషయంలో మొసలి కన్నీరు కార్చుతుండడం ఆశ్చర్యకరమే మరి. ఇక, బీజేపీ సైతం ఈ విషయంలో తక్కువేమీ తిన్లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ నడుస్తున్న రాజకీయాలు అందరికీ తెలిసినవే. ఆ బీజేపీనే, రఘురామ అరెస్టు వ్యవహారంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేస్తోంది. ఎంతైనా బీజేపీ పెద్దలకు రఘురామ అత్యంత సన్నిహితుడు కదా.! ఇదిలా వుంటే, రఘురామ అరెస్టు వ్యవహారంలోకి కులాన్ని తీసుకొస్తున్నారు కొందరు. ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన ఓ సామాజిక వర్గం, రఘురామ అరెస్టుని తీవ్రంగా ఖండించేస్తోంది. ఆ కుల పెద్దలు కొందరు ఈ అరెస్టు వ్యవహారంపై గుస్సా అవుతున్నారుట. అది కూడా టీడీపీ నేత ఒకరు ఓ చర్చా కార్యక్రమంలో ప్రస్తావించడం గమనార్హం. రాష్ట్రంలో రాజకీయాలెలా వున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?