వైసీపీకి ఓట్లు వేసేవారు అన్నం తినే వేశారా..?

విజ్ఞత మరిచి, సంస్కారం విడిచి కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటుంటారు. అధికారులను దూషిస్తుంటారు.. తాము ప్రజా ప్రతినిధులం అన్న ఇంగితం మరిచిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఓటర్లనే అనకూడని మాట అన్నారు. వైసీపీకి ఓట్లు వేసేవారు అన్నం తినే వేశారా? అని ప్రశ్నించారు. దీంతో… నెటిజన్లు సదరు ఎమ్మెల్యేని ఒక్క రేంజ్ లో ఆడుకుంటున్నారు.. ఈసారి ఓట్లు అడగడానికి రా.. నీకు ఏమి తినిపిస్తామో చూద్దువుగాని అని సవాల్ చేస్తున్నారు!

అవును… బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు ఓటర్లపై నోరు చేసుకున్నారు. తనకు సంస్కారం, విజ్ఞత వంటివి మచ్చుకైనా లేవని చెప్పాలనుకున్నారో.. లేక, ఒక్కసారి ఓటు వేసిన ప్రజలకు రీకాల్ చేసే అవకాశం లేదు, ఐదేళ్లు భారించాల్సిందే కాబట్టి ఇప్పట్లో సమస్య లేదని భావించారో తెలియదు కానీ… ఓటర్లపై నోరు జారారు! వైసీపీకి ఓట్లు వేసేవారు అన్నం తినే వేశారా? అంటూ ప్రశ్నించారు.. దీత్మో తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

వాస్తవానికి జనం అన్నం తిని ఓట్లు వేస్తారా, బ్రేక్ ఫాస్ట్ చేసి వచ్చి ఓట్లు వేస్తారా అన్నది పాయింట్ కాదు. అలా అనుకుంటే… 2014లో కూటమి ప్రవర్తన చూశాక, ఏపీకి మోడీతో కలిసి పొడిచిన పోటు చూశాకా నిజంగా విష్ణుకుమార్ రాజు ప్రకారం అన్నం తినేవాడు ఎవడూ కూటమికి ఓటు వేయడనే అనుకోవాలి! 2014-19 మధ్య చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా 2024లో అవే మాటలు చెప్పినా జనం నమ్మారంటే… వారంతా అన్నం తినడం లేదు అని అనుకోకూడదు!

అలా అనుకుంటే… ఈ రోజు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. పవన్ కల్యాణ్ తో కలిసిన తర్వాత అయినా చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తారు.. ఇప్పటికైనా మోడీ మారి ఏపీకి న్యాయం చేస్తారు.. ఈ ఒక్కసారికైనా చూద్దాం అని భావించి ఓటు వేసి ఉండొచ్చు కదా! అసలు ఏపీ వంటి రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వచ్చాయంటేనే విష్ణుకుమార్ రాజుకి ఓ క్లారిటీ వచ్చి ఉండాలి!

ఆ పార్టీ పంచన, ఈ పార్టీ పంచన చేరి పబ్బం గడుపుకుని, నాలుగు సీట్లు గెలుచుకుని, ఇప్పుడు కేంద్రంలో కూడా కుంటి గుర్రంలా నడుస్తున్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజుకి వైసీపీకి ఓటు వేసిన వారిని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా.. నైతిక అర్హత ఉందా? అనేది అన్నం తిని ఓటు వేసినవారి మరో ప్రశ్న! అది ఆయన విజ్ఞతకే వదిలేస్తే… ఆయన పోటీ చేసిన విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజుకి 53% ఓట్లు వచ్చాయి. అంటే.. మిగిలిన 43% మంది ఏమి తింటున్నారో వారికే తెలియాలి?

2019 ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజుకి 10శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అది పొత్తులు లేకుండా ఆయన ఒరిజినల్ స్టామినా అయ్యి ఉండొచ్చు గాక!.. మరి మిగిలిన 90శాతం మంది నాడు అన్నం తినకుండా ఉన్నారా? ఇప్పుడు అందులో ఓ 40 శాతం మంది సడన్ గా అన్నం తినడం మొదలుపెట్టి కూటమి, విష్ణుకుమార్ రాజు ఉద్దరిస్తారని ఓటు వేశారా? వైసీపీ 40% ఓట్లు వచ్చాయని లోపల కుళ్లు ఉంటే ఉండొచ్చు.. అయితే ఆ శాతాన్ని తగ్గించడానికి మార్గం ఇదైతే కాదు. సంస్కారం ఉన్నవారు ఆలోచించుకొందురు గాక!!