కరోనా విషయంలో కేసీఆర్‌ సర్కార్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం 

గత ఆరేళ్ల కేసీఆర్ ప్రజల నుండి చాలా మంచి ఫీడ్ బ్యాక్ అందుకున్నారు.  పక్క రాష్ట్రాలు సైతం ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల రూపకల్పనలో  కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడాయి.  పాలన పరంగా అంత మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.  వైరస్ కట్టడిలో టీ సర్కార్ విఫలమైందని, తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తోందని విపక్షాలే కాదు ప్రజలు సైతం అంటున్నారంటే పరిస్థితి దారుణంగా ఉందో అర్థమవుతోంది. 
 
మొదట్లో వైరస్ నివారణకు పారాసిటమాల్ గోళీ వేసుకుంటే సరిపోతుందన్న కేసీఆర్ త్వరగానే వైరస్ ప్రమాద తీవ్రతను గుర్తించి చర్యలు చేపట్టారు.  మిగతా రాష్ట్రాల కంటే పటిష్టంగానే లాక్ డౌన్ అమలుచేశారు.  కానీ వైద్య సేవల విషయంలోనే అప్రదిష్ట పాలవుతున్నారు.  ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో కోవిడ్ టెస్టులు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి.  మొదట్లో వాటిని రాజకీయంగా చూసిన ప్రజలు ఆ తర్వాత మెల్లగా కేసుల సంఖ్య పెరగడం, టెస్టుల సంఖ్యలో పెరుగుదల కనిపించకపోవడంతో అనుమానాలు లేవనెత్తారు. 
 
హైకోర్టు సైతం ప్రభుత్వం ఎందుకు పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం లేదని పలుమార్లు అక్షింతలు వేసింది.  అధికారిక లెక్కల మేరకు ఏపీతో పోల్చితే తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉంది.  కానీ రికవరీ రేటు ఏపీతో చూసుకుంటే తక్కువగా, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.  దీంతో టీ సర్కార్ అందిస్తున్న వైద్య సేవలు నాసిరకంగా ఉన్నాయనే వాదన మొదలైంది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే పరీక్షలు, వైద్యం అంటూ ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు, హైకోర్టు తప్పుబట్టాయి.  
 
వైరస్ వ్యాప్తిని ఆపలేకపోయినా బాధితులకు వైద్యం అందించడంలో మెరుగ్గా ఉంటే ప్రజల ప్రాణాలు నిలబడతాయి.  కానీ కేసీఆర్ అక్కడే విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి.  ఆ విమర్శలకు తాజాగా కోవిడ్ వైరస్ సోకిన జర్నలిస్ట్ మరణం మరింత ఆజ్యం పోసింది.  జర్నలిస్ట్ సోదరుడు మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో వైద్య సహాయం ఆందకపోవడం వల్లనే తన తమ్ముడు చనిపోయాడని చెబుతున్నారు.  తాను, తన సోదరుడు ఫీవర్ హాస్పిటల్ నుండి గాంధీకి షిఫ్ట్ చేయబడినప్పటి నుండి తన తమ్ముడు చనిపోయే వరకు గంటకు గంటకు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించారు. 
 
ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం, వైద్యం అందించడంలో పూర్తిగా రెండు పూటలు ఆలస్యం జరిగిందని, కనీసం ఆక్సీజన్ పెట్టే పరిస్థితి కూడా లేదని, సౌకర్యాల విషయంలో, సామాన్య పేషంట్ల పట్ల స్పందించే తీరులో పూర్తిగా వైఫల్యం ఉందని, సకాలంలో ట్రీట్మెంట్ అంది ఉంటే బ్రతికి ఉండేవాడని వాపోయారు.  జర్నలిస్ట్ సైతం మరణానికి ముందు సన్నిహితులతో ఇక్కడ అసలు పట్టించుకోవట్లేదు, నన్ను ప్రైవేట్ ఆసుపత్రికి మార్చండి అంటూ చేసిన వాట్సాప్ చాట్ మరింత సంచలనమైంది. 
 
దీంతో ప్రభుత్వంపై సామాన్యుల విమర్శలు ఎక్కువయ్యాయి.  కరోనాతో గాంధీ ఆసుపత్రికి వెళితే బ్రతుకుతామనే నమ్మకం లేదని, ప్రభుత్వం ప్రజల ప్రాణాల్ని కాపాడలేకపోతోందని అంటున్నారు.  ఈ విమర్శలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వైఫల్య భావన ఏర్పడేలా చేస్తున్నాయి.  కనుక ప్రభుత్వం వైద్య సేవల్లో లోపాలుంటే సరిచేసుకుని మరణాల సంఖ్య తగ్గేలా చూసుకోవాలి.