ప్రజలు ఓటు వేయడమంటే నమ్మకాన్ని చూపించడమే. గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాన్ని నడిపించాలి, ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిలవాలి. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యవహారం దీనికి భిన్నంగా సాగుతోందని ప్రత్యర్థి నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి తిరిగి గెలిచినా, ఆయన గత 15 నెలలుగా అసెంబ్లీకి దూరంగా ఉంటూ ప్రజల మధ్యకే రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు.
ఇది రాజ్యాంగ నిబంధనలకూ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ వ్యతిరేకంగా భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “పని చేయకుండా వేతనం తీసుకునే ఏకైక ఎమ్మెల్యే కేసీఆర్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు ఇప్పటివరకు రూ.57 లక్షల వేతనాన్ని ప్రభుత్వం చెల్లించిందని, అదనంగా భత్యాలు, సెక్యూరిటీ ఖర్చులు కూడా ప్రభుత్వంపై భారం పెడుతున్నాయని వివరించారు.
ఈ వ్యాఖ్యలు కేసీఆర్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, అసెంబ్లీ వ్యవహారాల్లో ఆయన దూరంగా ఉండడంపై అధికార పార్టీ అసహనాన్ని బహిర్గతం చేశాయి. ఇక గజ్వేల్ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఉద్యమానికి దిగారు. సుమారు 50 మందికి పైగా పాదయాత్రగా హైదరాబాద్‌కు వచ్చి ముఖ్యమంత్రి, గవర్నర్‌లను కలిసే యత్నంలో ఉన్నారు. అసెంబ్లీ సభకు హాజరు కాకుండా వేతనం తీసుకుంటున్న కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. నర్సారెడ్డి నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమం రాజకీయంగా కొత్త మలుపులు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో బీజేపీ కూడా రంగంలోకి దిగింది. కేసీఆర్ వ్యవహారంపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీనితో ఈ వివాదం మరింత తీవ్రమవుతుంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ… రెండు పార్టీలూ కేసీఆర్‌ను గట్టిగా ఉద్దేశిస్తూ చర్యలకు పూనుకుంటుండటంతో, అసెంబ్లీ సభకు రావడంపై ఆయన తుది నిర్ణయం ఏమవుతుందో తెలియాల్సి ఉంది. సభలో ప్రమాణం చేసిన ప్రతినిధి సభకు హాజరుకావాల్సిన బాధ్యతను విస్మరించడం రాజకీయపరంగా కాకుండా నైతికపరంగా కూడా ఆవేదన కలిగించే అంశమే.