గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు భావిస్తారో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గవ్వలను ఎంతో పవిత్రమైనవిగా భావించి పూజిస్తుంటారు.ఇలా గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మన ఇంట్లో పూజ మందిరంలోనూ లేదా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడుతూ ఉంటాము.ఈ విధంగా గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకు భావిస్తారు గవ్వలను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎందుకు ఉంటుంది అనే విషయానికి వస్తే…

గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెలు గాను శంఖువులను తమ్ముళ్లు గాను భావిస్తారు. పురాణాల ప్రకారం సాగర మదనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించారు. అందుకే సముద్రంలో ఉన్నటువంటి గవ్వలను కూడా లక్ష్మీదేవికి సోదర సోదరీమణులుగా భావించి పూజిస్తారు. ఎక్కడైతే గవ్వలను పూజింపబడతామో అక్కడ తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. గవ్వలలో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే పసుపు పచ్చ గవ్వలను పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

ఇలా పచ్చ గవ్వలను ఇంట్లో లక్ష్మి పీఠం వద్ద ఉంచి పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే డబ్బులు నిలువ చేసే డబ్బాలో కూడా గవ్వలను పెట్టడం ఎంతో మంచిది.నూతనంగా నిర్మిస్తున్న గృహాలకు అలాగే వాహనాలలో కూడా గవ్వలను కట్టడం వల్ల పెద్ద ప్రమాదాల నుంచి కూడా బయటపడవచ్చు. ఇకపోతే నల్లటి దారంలో చిన్న పిల్లలకు మెడలో ఈ గవ్వలను కట్టడం వల్ల చిన్న పిల్లలపై ఎలాంటి నరదృష్టి కూడా ఉండదని భావిస్తారు. ఇక దీపావళి పండుగ సమయంలో ఇంట్లో ప్రత్యేకంగా గవ్వలతో ఆటలు ఆడుతూ ఉంటారు. ఇలా గవ్వల శబ్దానికి లక్ష్మీదేవి మన ఇంట ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. అందుకే గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేస్తుంటారు.