ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి ఊహించని మలుపులు తీసుకుంటోంది. జగన్ సొంతగడ్డ కడపలో తాజా రాజకీయ పరిణామాలు మరోసారి రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పటివరకు కడప అంటే వైఎస్ కుటుంబానికి ఓ గౌరవ గుర్తింపు. అయితే, గడిచిన ఎన్నికల్లో కడపలో కూటమి డామినేషన్ చూపించగా.. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కూడా చేజిక్కించుకునే ప్రయత్నాల్లో టీడీపీ కీలక దశకు చేరుకుంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపలో 50 జడ్పీటీసీ సీట్లలో 49 పై వైసీపీ విజయం సాధించింది. కానీ పరిస్థితులు ఇప్పుడు పూర్తి భిన్నంగా మారాయి. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి చెందిన నలుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలం ఐదు కాగా… వైసీపీ 45కు పడిపోయింది. ఇక తాజా పరిణామాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం టీడీపీకి అచ్చొందిన అవకాశంగా మారింది.
ఇప్పటికే కూటమికి అనుకూలంగా ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్య పెరగడం, ఎమ్మెల్యేల మద్దతు టీడీపీకి దక్కడం వంటి అంశాలు జడ్పీ చైర్మన్ ఎన్నికపై ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ జడ్పీటీసీలను ప్రలోభాలకు గురి చేయకుండా నియంత్రించాలన్న దిశగా పార్టీ కీలక నేత అవినాశ్ రెడ్డి బృహత్తర వ్యూహాన్ని అమలు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే కారణంగా జడ్పీటీసీలను బెంగళూరు క్యాంప్‌కు తరలించారన్న వార్తలు ఊపందుకున్నాయి.
ఇదే సమయంలో టీడీపీ మాత్రం మరోపక్క చురుగ్గా పావులు కదుపుతోంది. తమ వైపు మొగ్గు చూపుతున్న జడ్పీటీసీలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, ఎలక్షన్ సమయానికి సరిపడే సంఖ్యలో మద్దతుదారులను కలుపుకుని చైర్మన్ పదవిని దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. ఈ లెక్కన చూస్తే జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ గడ్డపై చైర్మన్ స్థాయిలో పార్టీని నిలబెట్టుకోవడానికి గట్టి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ పావులు కదుపుతున్న వేగాన్ని చూస్తే, కడపలో పార్టీ గుర్తును నిలబెట్టుకోవడం వైసీపీకి సవాలుగా మారిందన్నమాట.