పిల్లల మీద జగన్ మరో ప్రయోగం.. వర్కవుట్ అవుతుందా ?

education system
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు కొన్ని సాహసోపేతంగా ఉంటున్నాయి.  ఈ సాహసాలు వ్యవస్థలను సమర్థవంతంగా నడపడంలోనో లేకపోతే దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్యల పరిష్కారానికో చేస్తే పర్వాలేదుకానీ సున్నితమైన విషయాల్లో చేస్తుండటమే ఆందోళన కలిగిస్తోంది.  అది కూడా విద్యా వ్యవస్థలో.  అందులోనూ కీలకమైన పాఠశాల విద్యా విధానంలో.  అందుకే ఈ ఆందోళన.  పేదలకు సైతం ఇంగ్లీష్ విద్యను అందిస్తాం, తెలుగులో చదువుకుంటే ఈ పోటీ ప్రపంచంలో బ్రతకలేరు అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా తెలుగు మాధ్యమాన్ని తొలగించడానికి పూనుకున్నారు.  అన్ని వైపుల నుండి ఈ విధానం మీద మాతృభాషను చంపేస్తారా అనే విమర్శలు రావడంతో కొన్ని తెలుగు మీడియం స్కూళ్లు ఉంటాయని అన్నారు.  స్వయంగా కేంద్రమే ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే మంచిదని, అలాగే ఉండాలని నూతన విద్యా విధానంలో చెప్పినా దాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని నిర్భంధ ఇంగ్లీష్ విద్య అమలుచేస్తామని అంటున్నారు.
education system
 
ఈ నిర్ణయానికే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన ఉంటే కొత్తగా మరొక ప్రయోగానికి తెరతీశారు.  అదే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ పాఠశాలలుగా మార్చడం.  అసలు ప్రీప్రైమరీ విద్య అనేది ఉండరాదని, అది పసి పిల్లల మీద ఒత్తిడికి కారణమవుతోందని ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ప్రీప్రైమరీ విభాగమే ఉండదు.  ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ప్రీప్రైమరీ విధానం ఉంది.  ఆ విధానాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజుల కోసమే నడుపుతున్నాయనే సంగతి అందరికీ తెలుసు.  తెలిసీ ఎందుకు పిల్లల్ని అక్కడకు పంపుతున్నారు అంటే ఎక్కడ తమ పిల్లలు మిగతా పిల్లల కంటే వెనకనడిపోతారేమో అనే భయంతో, ప్రీప్రైమరీ స్కూల్లో చదవలేదంటే చిన్నచూపు చూస్తారేమోననే అపోహతో పంపుతున్నారు.  అంతేకానీ మాటలే సరిగా రాని ఆ వయసులో ఏదో నేర్చెసుకుంటారని కాదు. 
 
 
అలాంటి ప్రీప్రైమరీ విద్యను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించాలని అనుకుంటోంది.  అయితే అది ప్రభుత్వ పాఠశాలల ద్వారా కుదరదు కాబట్టి అందుకు వేదికగా అంగన్‌వాడీ కేంద్రాలను వాడుకోవాలని ప్లాన్ చేశారు.  సీఎం ఆలోచన మేరకు అంగన్‌వాడీ కేంద్రాలనీ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మారనున్నాయి.  దీనికోసం 4000 కోట్ల రూపాయలను కేటాయించారు.  రాష్ట్రంలో 50,000లకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.  ఇవన్నీ ఇకపై ప్రీప్రైమరీ పాఠశాలలే.  ఒక అవసరం కోసం కేటాయించిన వనరులను ఇంకో అవసరానికి వాడటం, అవసరం లేకున్నా సృష్టించుకుని మరీ వాడుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలావాటే.  ఆ అలవాటులోనే ఈ పథకాన్ని రూపొందిచినాటు ఉన్నారు.  
political
 
అసలు అంగన్‌వాడీల ప్రధాన ఉద్దేశ్యం మాతా-శిశు సంక్షేమం.  7 నెలల వయసు నుంచి 6 ఏళ్ల వరకు పిల్లలతో పాటు, గర్భిణీలకు పోషకాహారం అందివ్వడం, పిల్లలను పాఠశాల వాతావరణానికి అలవాటు చేయడం.  ఈ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు సామర్థ్యం కూడా మాత, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడటం కోసం, ఆరోగ్య సూచికల పరిశీలన కోసమే శిక్షణ పొంది ఉంటారు.  అలాంటివారి చేత ఇప్పుడు ప్రీప్రైమరీ విద్యను బోధిస్తామని సర్కార్ అంటోంది.  ఆమేరకు అంగన్‌వాడీ టీచర్లకు ఏడాదిపాటు డిప్లొమా కోర్సు ద్వారా శిక్షణ ఇస్తారట.  వారు ఆ సంవత్సరం ప్రావీణ్యంతో పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్ విద్యలో తర్ఫీదు ఇచ్చి ప్రాథమిక పాఠశాలకు వారిని సిద్దం చేయాలట. 
 
చెప్పడానికి ఈ మాటలు సులభంగానే ఉంటాయి కానీ ఆచరణలో సాధ్యమవడం అంత సులువు కాదు.  ఎందుకంటే చాలీ చాలని జీతాలతో, నిత్యం సమస్యలతో సతమతమయ్యే అంగన్‌వాడీ టీచర్లు ఇప్పుడు కొత్తగా కోర్సు, శిక్షణ, అదనపు బాధ్యతలు అంటే పెదవి విరవడం ఖాయం.  దీని మూలంగా కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లల మీద ఒత్తిడి సమస్య అయితే ఇక్కడ నిర్లక్ష్యం సమస్యగా మారవచ్చు. పైగా అంగన్‌వాడీ కేంద్రాల పరిస్థితి ఏమిటో అందరికీ అనుభవమే.  ఇరుకు గదుల్లో, పాడుబడిన ప్రభుత్వ పాఠశాలల్లో  నడిచే కేంద్రాలు అనేకం ఉన్నాయి.  డబ్బు కుమ్మరించి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు కానీ పాత టీచర్లనే కొత్తగా మలచి నాణ్యమైన విద్యను అందిస్తామనడమే అసాధ్యంగా కనిపిస్తోంది.  మరి పిల్లలపై, అంగన్‌వాడీ టీచర్లపై జరపబడునున్న ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.