Game Changer – OG: గేమ్ ఛేంజర్ రాకపోతే OG వచ్చేది

తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల హవా కొనసాగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీ ‘గేమ్ చేంజర్’పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అమెరికాలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌తో మూవీ ప్రమోషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా యూఎస్‌లో ఈవెంట్ నిర్వహించి రికార్డు సృష్టించిన తెలుగు సినిమా ఇది కావడం గమనార్హం.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానుల మధ్య సంబరాల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ‘ఓజీ’ సినిమా గురించి చరణ్ మాట్లాడిన సమయంలో అభిమానుల హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి. బాబాయ్ సినిమా కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని, ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మరింత హైప్ తెచ్చుకుంటుందని అన్నారు. ఒకవేళ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ రాలేని పరిస్థితి ఉంటే తప్పకుండా OG ఆ సమయానికి వచ్చేలా బాబాయ్ ను ఒప్పించే వాడినని చరణ్ అన్నారు.

ఇది మెగా అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. ‘గేమ్ చేంజర్’ సినిమా ద్వారా హిందీ మార్కెట్‌ను సైతం మేకర్స్ టార్గెట్ చేస్తున్నారు. దిల్ రాజు హిందీ ప్రేక్షకులకు స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ‘పుష్ప 2’, ‘దేవర’, ‘కల్కి 2898ఏడీ’ వంటి సినిమాలు నార్త్ ఇండియాలో మంచి విజయాలు సాధించిన దృష్ట్యా ‘గేమ్ చేంజర్’ కూడా అక్కడ భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో, శంకర్ కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నారు. గత చిత్రం ‘ఇండియన్ 2’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ‘గేమ్ చేంజర్’పై శంకర్ ఆశలు పెట్టుకున్నారు. మరి సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ ఎలా రాణిస్తుందో చూడాలి.