Game Changer: గేమ్ ఛేంజర్ పై అంచనాలు మరో స్థాయికి

అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు పెంచింది. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన, జరుగుతున్న కొన్ని సంఘటనలు ఉన్నాయని తెలిపారు. అవి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయని, చప్పట్లు కొట్టేలా చేస్తాయని చెప్పడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

శంకర్ సినిమాల్లో సమకాలీన అంశాలను ప్రతిబింబించడం కొత్త విషయం కాదు. జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి చిత్రాల్లో సామాజిక సమస్యలను హైలైట్ చేసిన శంకర్, తన సరికొత్త కథనాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించారు. దిల్ రాజు వ్యాఖ్యల ప్రకారం, నాలుగేళ్ల క్రితం రాసుకున్న ఈ కథ ఇప్పుడు నిజం కావడం ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుందని, ఇది శంకర్ ప్రత్యేకతని తెలియజేస్తోంది. ఫ్యాన్స్ ఈ సినిమా తనను తాను మించిపోతుందని నమ్ముతున్నారు. ఉదాహరణగా హైడ్రాకు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు టాక్.

ఈ సినిమా విషయంలో శంకర్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ఇండియన్ 2 ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా, గేమ్ ఛేంజర్ ద్వారా ఆయన తన మునుపటి వింటేజ్ స్థాయిని మళ్లీ అందుకుంటారనే నమ్మకం ఉంది. ఇది విజయవంతమైతే, ఇండియన్ 3 లాంటి ప్రాజెక్టులకు కూడా క్రేజ్ కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ట్రైలర్ 27న హైదరాబాద్‌లో విడుదల కానుందని సమాచారం.

ట్రైలర్ లాంచ్ తర్వాత మరో ఈవెంట్ రాజమండ్రిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా చిత్రంగా గేమ్ ఛేంజర్ థియేటర్లలో సందడి చేయనుంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.