Komatireddy: అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి: కోమటిరెడ్డి

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసి, సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచారు. ఇకపై రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలు ఉండవని, సినిమా టికెట్లకు ఎక్స్ ట్రా రేట్లు అనుమతించబోమని ఆయన ప్రకటించారు. ప్రత్యేక చారిత్రక సందర్భాలు లేదా తెలంగాణ పోరాటానికి సంబంధించిన సినిమాలు తీసినప్పుడు మాత్రమే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

ఇక అల్లు అర్జున్ శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లోని వ్యాఖ్యలపై కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. “సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నిజంగా పోలీసుల సమాచారం ఆధారంగానే జరిగినవి. అలాంటి విషయాలను తప్పుడు గా చూపించడం సరికాదు. అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి,” అంటూ ఆయన అన్నారు.

రేవతి కుటుంబంపై ప్రస్తావిస్తూ, “ప్రాణం పోయిన కుటుంబం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. వారి కొడుకు శ్రీతేజ్ ఇంకా చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. అలాగే, ప్రతీక్ ఫౌండేషన్ వారి పిల్లల భవిష్యత్‌ బాధ్యతను తీసుకుంటుంది,” అన్నారు. రేవతి కుటుంబాన్ని చూసి కంటతడి పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదే సమయంలో, చిత్రపురిలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, త్వరలో సినిమా పరిశ్రమతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని అన్నారు. “ఇండస్ట్రీ అంటే ప్రభుత్వానికి ప్రేమ ఉంది. కానీ, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్చలు జరగాలి. టికెట్ ధరల నియంత్రణ, ప్రత్యేక షోల నియమావళిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం,” అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.