ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. అభ్యర్థుల ఎంపికలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణమా.. లేక, మరేదైనా కారణం ఉందా అనే చర్చా దీనికి అనుగుణంగా మొదలైంది. ఏది ఏమైనా… 151 ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీలో అసెంబ్లీకి మాత్రం కేవలం 40మంది మాత్రమే హాజరయినట్లు ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీనిపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
గత మూడు రోజులుగా జరుగుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలలో అధికార పక్షం నుంచి ఎమ్మెల్యేలు చాలా పలుచగా హాజరు ఉండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ప్రధానంగా రెండో రోజు గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొనే సమయానికి వైసీపీ నుంచి కేవలం నలభై మంది మాత్రమే ఎమ్మెల్యేలు కనిపించడం జరిగింది. దీంతో… ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది అనే ప్రశ్న నెట్టింట వైరల్ గా మారింది.
వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటుతామనే ధీమాతో అధికారపార్టీ పెద్దలు, శ్రేణులూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సరిగ్గా ఈ సమయంలో నిర్వహిస్తున్న అఖరు సమావేశాలకు ఎమ్మెల్యేలు సరిగ్గా హాజరు కాకపోవడం ఏమిటనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే… వైసీపీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లను అధినాయకత్వం నిరాకరిస్తోంది. అనేకమందికి నియోజకవర్గాలు మారుస్తుంది. మరికొంతమందిని ఎంపీలుగా పంపుతుంది.
అయితే ఈ విషయంలో పైకి కనిపించడం లేదు కానీ.. లోలోపల పలువురు అభ్యర్థులు అసంతృప్తితో రగిలిపోతున్నారని, అసౌకర్యంగా ఫీలవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు కనిపించిన ఈ గైర్హాజరీ నెంబరే ఇందుకు సాక్ష్యం అని చెబుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాల పేరు చెప్పి తనతో సీట్ల గురించి మాట్లాడే అవకాశం కూడా జగన్.. తమ ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదని అంటున్నారు!!
ఏది ఏమైనా… ఇంతమంది ఎమ్మెల్యేలు ఒకేసారి అసెంబ్లీకి గైర్హాజరవ్వడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కాగా… రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ వెళువడనున్న నేపథ్యంలో… మాక్ పోలింగ్ కి ఎంతమంది హాజరవుతారనేది వేచి చూడాలి!