మంచో చెడో.. అయిదేళ్ల వృధా అయిపోయాయి. ఆంధ్ర రాష్ట్రం రాజధాని నగరం లేకుండా దేశం దృష్టిలో పలచన అయిపోయిన చీకటి రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడిక రాజధాని ఫిక్స్..అది అమరావతి..!
నిజానికి ఆనాడు 2014 లో ఉమ్మడి ఆంధ్రా విడిపోయి స్వర్ణాంధ్ర ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని పదేళ్ల వరకు..అంటే..2024 వరకు వాడుకునే అవకాశం ఉన్నా త్వరితగతిన అడుగులు వేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించి అవసరమైన హంగులు సమకూర్చే దిశగా అడుగులు వేసారు. ఒక దశలో రాజధానిగా విశాఖను కూడా అనుకున్నారు.అయితే చివరకు చంద్రబాబు అమరావతివైపే మొగ్గు చూపారు.
రాజు తలచుకుంటే..అన్నట్టు అక్కడి నుండి వడివడిగానే అడుగులు పడ్డాయి.సచివాలయంతో పాటు కార్యాలయాలన్నీ వచ్చేశాయి. హైకోర్టు కూడా ఏర్పాటయింది. శాసనసభ ప్రాంగణంతో పాటు మంత్రులు..అధికారుల నివాస భవనాలు సమకూరాయి. చిన్ని చిన్ని అడుగుల దశ దాటి పెద్ద పెద్ద నిర్మాణాలు మొదలుపెట్టే నాటికి ప్రభుత్వం మారింది.జగన్మోహన రెడ్డి అమరావతికి గ్రహణం పట్టించేసారు.పోనీ విశాఖను రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు.
సరే..ఆ రోజులు వెళ్లిపోయాయి. ఇప్పుడు అమరావతి రాజధానిగా నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు బాధ్యత చంద్రబాబుదే. హైదారాబాద్ అభివృద్ధి గురించి గొప్పలు పోయే చంద్రబాబు ఇప్పుడు తన సత్తా మరోసారి చూప్పల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ రాష్ట్రం రాజధాని నగరం కోసం ఆశగా ఎదురు చూస్తోంది.విభజన కారణంగా హైదారాబాద్ వంటి మహానగరానికి దూరమైన ఆంధ్ర ప్రజలు ఇప్పుడు తత్సమానమైన రాజధాని నగరం కోసం ఆశ పడుతోంది.
రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యవహారం కాదు.కులాల కుంపటి కానేకాదు.రాష్ట్రానికి గుండె కాయ..స్టేటస్ సింబల్. గొప్పగా చెప్పుకునే సెంటర్ పాయింట్..అమరావతి మరో హైదారాబాద్ కావాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు..
బాబూ వింటున్నారా..!!