Sandhya Theatre Stampede: ఇటీవల డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ అప్పటి నుంచి ఈరోజు వరకు హాస్పటల్లో చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. వైద్యులు కూడా అతనికి ఎప్పటికప్పుడు బెటర్ ట్రీట్మెంట్ ని అందిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే శ్రీతేజ్ కుటుంబానికి అటు పుష్ప మూవీ మేకర్స్ ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ అండగా నిలిచిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న పుష్ప సినిమా నిర్మాతలు సికింద్రాబాద్ లో కిమ్స్ హాస్పిటల్ లో ఉన్న శ్రీతేజ్ పరామర్శించి 50 లక్షల రూపాయల చెక్ ని అందజేశారు.
తాజాగా అల్లు అరవింద్ కూడా శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలిచి ఏకంగా బాధిత కుటుంబానికి రెండు కోట్ల రూపాయల సహాయం అందజేయన్నట్లు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరఫున రూ.కోటి పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంబంధిత చెక్కులను ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందజేశారు. దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ తీసేశారు. బాలుడు త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నాను. న్యాయపరమైన అంశాల కారణంగా బాధిత కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నాను. అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్‌ను 10 రోజుల క్రితం పరామర్శించాను. ఆ సమయంలో వెంటిలేషన్ పై ఉన్నాడు అని అల్లు అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధిత కుటుంబానికి అల్లు అరవింద్ రెండు కోట్ల రూపాయలు సహాయం చేయడం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.