Jani Master: శ్రీతేజ్‌ కుటుంబాన్ని పరామర్శించిన జానీ మాస్టర్.. కొన్ని పరిధిలు ఉంటాయి అంటూ!

Jani Master: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు జానీ మాస్టర్ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మారుమోగిన విషయం తెలిసిందే. లైంగిక కేసు ఆరోపణలో భాగంగా అరెస్టయి జైలుకు వెళ్లడంతో పాటు కొద్దిరోజులు జైల్లోనే గడిపి వచ్చారు ఆ జానీ మాస్టర్. ఆ సమయంలో పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. చాలామంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్ యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ వెళుతున్నారు.

మొన్నటికి మొన్న ఒక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సంధ్య థియేటర్ ఘటన గురించి ఇప్పటికే జానీ మాస్టర్ స్పందించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తూ.. నేను కూడా ఒక కేసులో నిందితుడిని, ఈ విషయంపై ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను. నాపై కూడా ఆరోపణలు ఉన్నాయి. నేను మాట్లాడకూడదు కూడా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండే తాజాగా జానీ మాస్టర్ ఈ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ని పరామర్శించారు.

కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ కుటుంబాన్ని కలిశారు జానీ మాస్టర్‌. డ్యాన్సర్స్‌ యూనియన్‌ తరఫున సాయం చేస్తామని ఆయన మాటిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. శ్రీతేజ్‌ ఆరోగ్యం మెరుగవుతోంది. అతడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అతడి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పాము. ఇండస్ట్రీకి చెందిన చాలామందికి శ్రీతేజ్‌ ను వచ్చి పలకరించాలని ఉంటుంది. కాకపోతే కొన్ని పరిధిలు ఉంటాయి. వాటివల్ల అందరూ వచ్చి కలవలేకపోవచ్చు అని జానీ మాస్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.