Public Events: పబ్లిక్ ఈవెంట్స్ చేయడానికి భయపడుతున్న హీరోలు, నిర్మాతలు.. అసలేం జరిగిందంటే!

Public Events: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా సంధ్య థియేటర్ ఘటన గురించి చర్చించుకుంటున్నారు. వార్తల్లో టీవీలలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ ఘటన గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క ఘటన అల్లు అర్జున్ ఫ్యామిలీని కుదిపేయడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని డైలమాలో పడేసింది. చిన్న విషయం కాస్త చిలికి చిలికి గాలి వానగా మారింది. ఈ విషయంలో పడి కనీసం విడుదల అయ్యే సినిమాలను విడుదల అయిన సినిమాలను కూడా పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. భారీ బడ్జెట్లు, వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌లు అంటూ హంగామాకు రెడీ అవుతోన్న ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు అలర్ట్ అయిపోతున్నారు. ఇక అసలు పబ్లిక్ ఈవెంట్స్ పెట్టవద్దని భావిస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్న మూడు పెద్ద సినిమాల ప్రమోషన్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా చేసుకోవాలని అనుకుంటున్నారట. ఓపెన్ ప్లేస్‌లో ఈవెంట్స్, క్రౌడ్ గ్యాదరింగ్స్ చేయొద్దని నిర్మాతలకు చెప్తున్నారట హీరోలు. అంతేకాదు ఫ్యాన్స్ కూడా ఎవరూ తమను కలవడానికి ర్యాలీలుగా రావద్దని అంటున్నారట. డిసెంబర్ 29న విజయవాడలో జరిగే గేమ్‌ ఛేంజర్‌ భారీ కటౌట్ ఈవెంట్‌ కు కూడా ఫ్యాన్స్ ఎక్కువ రాకుండా చూస్తున్నారట. ఎలాంటి ఘటనలు జరగకుండా చూడటంతో పాటు ఫ్యాన్స్‌ కు దూరంగా మీడియా, సోషల్ మీడియా వేదికగానే ఈవెంట్స్‌ చేస్తారని టాలీవుడ్ టాక్.

అయితే పబ్లిక్ ఈవెంట్స్ చేయకపోతే ప్రమోషన్స్ ఎలా అనేదే నిర్మాతలను, స్టార్ హీరోలను భయపెడుతున్న అంశం. మీడియా, సోషల్ మీడియాలో ప్రమోషన్స్‌ చేస్తే అంత అటెన్షన్ వస్తుందా, మూవీ పబ్లిక్‌లోకి వెళ్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారట. సంధ్య థియేటర్ ఘటన జరగకపోయి ఉంటే ఈ బాధే ఉండకపోయేదని మధన పడుతున్నారట సినీ నిర్మాతలు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేదేలా అని తలలు పట్టుకుంటున్నారట ప్రొడ్యూసర్లు, హీరోలు. మరి ఇకమీదట నిజంగానే పబ్లిక్ ఈవెంట్లను నిర్వహించరా? నిర్వహించకపోతే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను ఏ విధంగా చేస్తారో సినిమాలను ఏ విధంగా ప్రమోట్ చేస్తారో అన్నది చూడాలి మరి. ఒక్క పుష్ప సినిమా ఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు తారుమారు అయ్యాయి.