ఏమి జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అయిదుకోట్లమంది ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం గొప్పదా? ఎవరో ఒక అధికారి ఇష్టానిష్టాలు గొప్పవా? ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ రెండూ రాజ్యాంగ వ్యవస్థలే. రాష్ట్రంలో పాలనా నిర్వహణ, శాంతిభద్రతలు, అధికారయంత్రాంగాన్ని పనిచేయించడం, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం అధికారపరిధిలోనివి. ప్రభుత్వ అభిమతాన్ని తృణీకరించి ఒక అధికారి పంతం చెల్లించడం సాధ్యం అవుతుందా? బహుశా దేశంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులను చూస్తున్నది.
ఇప్పటికి దేశం ఎంతోమంది ఎన్నికల కమిషనర్లను చూసింది. టీ ఎన్ శేషన్, లింగ్డో మినహా మరెవ్వరూ చరిత్రలో తమ ముద్ర వెయ్యలేకపోవడం మనం గమనించాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నదా? ఎన్నికల సంఘానికి సుప్రీమ్ కోర్ట్ ఏమని సూచించింది? ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎన్నికల కమీషనర్ ను కోరింది. ప్రభుత్వం అంగీకరించినా, తిరస్కరించినా ఎన్నికలు జరపాల్సిందే అని తీర్పు ఇచ్చిందా? రాష్ట్రప్రభుత్వం మాటకు విలువ లేనపుడు ఇక దాన్ని సంప్రదించాల్సిన అవసరం ఏమిటి?
ఒకప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపమని కోరినపుడు కొంత భాగం అయ్యాక హఠాత్తుగా ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టాలతో నిమిత్తం లేకుండా ఎన్నికలు జరపడానికి ఇవి లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికలు కావు కదా? స్థానిక సంతలకు ఏళ్ల తరబడి ఎన్నికలు జరపకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలను మనం చాలాసార్లు చూశాము. అంతెందుకు? 2018 లో జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం ఎందుకు జరపలేదు? అప్పుడు కరోనా లేదు కదా? ఆనాడు ఎందుకు జరపలేదని న్యాయస్థానాలు ఎన్నికల కమీషర్ ను ప్రశ్నించకపోవడం ఆయన అదృష్టం కావచ్చు. రోజుకు రెండు కేసులు కూడా లేనపుడు ఎన్నికలను వాయిదా వేసి, రోజుకు రెండువేల కేసులు నమోదవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ఎన్నికలకు పట్టుబట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?
ఎన్నికలు జరిపే పరిస్థితులు లేవని అధికార యంత్రాంగం తరపున చీఫ్ సెక్రెటరీ ఎన్నికల సంఘానికి తెలియజేశారు. మంత్రులు కొడాలి నాని, బాలినేని, పేర్ని నాని కూడా ఎన్నికలు జరపలేమని ప్రకటించారు. ముగ్గురు మంత్రులు అలా ప్రకటించారంటే దాన్ని ప్రభుత్వ ప్రకటనగానే భావించాలి. ప్రభుత్వం తరపున ఇంతమంది ఎన్నికలు జరపడానికి వీలు లేదు అని స్పష్టం చేస్తుంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతామని ఎన్నికల సంఘం ప్రకటించడం వెనుక దురుద్దేశ్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే రాజ్యాంగవ్యతిరేక ఆలోచనలే స్ఫురిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వానిదే తుది నిర్ణయం కావాలి. అంతే తప్ప ఎవరికివారు మేమే సమ్రాట్టులం అనుకుంటే కుదరదు.
ఒకవంక గత పదిరోజులుగా అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. పది రోజుల్లో పన్నెండు లక్షలమంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో కూడా మళ్ళీ లాక్డౌన్ విధించడానికి కేంద్రాన్ని అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా పెరిగే అవకాశం ఉందంటూ దీపావళి టపాసులను కాల్చవద్దని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. కొన్ని షరతులతో సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను సడలించింది. అంతే తప్ప కరోనా లేదని సుప్రీమ్ కోర్టు కూడా చెప్పలేదు. కానీ, ఎన్నికల కమీషనర్ మాత్రం కరోనా తగ్గిందని సర్టిఫికెట్ ఇస్తున్నారు. అలా సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎన్నికల కమీషనర్ కు ఉన్న అధికారం ఏమిటి? అలా చెప్పాల్సింది వైద్య ఆరోగ్యశాఖ మాత్రమే. ఇప్పటికీ బయటకు వెళ్తే కోవిద్ నిబంధనలు పాటించాల్సిందే.
బీహార్ లో ఎన్నికలు జరగలేదా, కొన్ని రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగలేదా అని కమీషనర్ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఆ ఎన్నికలు అనివార్యం. రాజ్యాంగం ప్రకారం జరిగి తీరాలి. అందుకే అనేక రక్షణ చర్యల మధ్య ఎన్నికలు జరిగాయి. పంచాయితీ ఎన్నికలు అనివార్యమేమీ కాదు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఎన్నికలు జరపాల్సిన ఆవశ్యకత అంతకన్నా లేదు.
ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు ఒక అధికారి మాట నెగ్గాలా లేక ఒక ప్రభుత్వం మాట నెగ్గాలా అనేది ఉత్పన్నమవుతున్న ప్రశ్న. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ప్రభుత్వం అంగీకరించకపోతే ఎన్నికల సంఘం ఏమి చేస్తుంది? ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించకపోతే ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోబడతాయి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే అంతిమం. ఒక అధికారి మాట నెగ్గితే అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. అందుకోసం ప్రభుత్వం ఎంతదూరమైనా వెళ్లాల్సిందే. ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించినప్పటికీ ఎన్నికల కమీషనర్ ఈరోజు గవర్నర్ ను కలిసి సంప్రదించారు. ఇది ముమ్మాటికీ కోర్ట్ ధిక్కారం కిందికే వస్తుంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు