యూనిఫాం సివిల్ కోడ్… జగన్ అలా – బాబు ఇలా!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం ఆలోచిస్తుందంటూ కథనాలొస్తున్న సమయంలో… దేశంలోని ముస్లింలలో అభద్రతా భావం పెరుగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ముందుకుపోయేలా కనిపిస్తుందని అంటున్నారు. దీంతో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలపై ముస్లింల మత పెద్దలు ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఏపీలోనూ ముస్లింలు అధికార వైసీపీ, విపక్ష టీడీపీపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ని కలిసిన ముస్లిం మత పెద్దలు… తాజాగా చంద్రబాబుని కలిశారు.

అవును… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు విషయంలో హామీని అడిగారు ముస్లిం పెద్దలు. దీంతో… “ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదు” అని జగన్… ముస్లిం మతపెద్దలకు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు, పార్టీ మైనారిటీ నాయకులు ఇవాళ కలిశారు. కేంద్రం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై టీడీపీ అభిప్రాయం చెప్పాలని కోరారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు… ముస్లిం వర్గ మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడూ పనిచేయదని తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ పై ముస్లిం వర్గానికి అండగా నిలుస్తామని ఆయన వెల్లడించారు. కాగా… పార్లమెంటులో జగన్ కు 22 లోక్ సభలోనూ, 9 రాజ్యసభలోనూ ఎంపీ సీట్లు ఉండగా… చంద్రబాబుకు లోక్ సభలో 3, రాజ్యసభలో 1 ఎంపీ సీటు ఉన్న సంగతి తెలిసిందే.