Tirumala: హరి ..హరి..తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టపగలే చోరీ.. ఆలస్యంగా వెలుగులోకి షాకింగ్ న్యూస్?

Tirumala: తిరుమల తిరుపతి ఆలయంలో చోరీ జరిగిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలియుగ దైవమైనటువంటి సాక్షాత్తు తిరుమల స్వామివారి హుండీలో ఈ దొంగతనం జరగడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వివిధ ప్రాంతాలలో చిన్న చిన్న ఆలయాలలో చోరీ జరగడం సర్వసాధారణంగా భావిస్తారు కానీ ఏడుకొండల పై ఉన్నటువంటి శ్రీవారి ఆలయంలో చోరీ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇక ఈ దొంగతనం నవంబర్ 23వ తేదీ జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది అయితే ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలను అధికారులు గుర్తించి ఆయన నుంచి దొంగలించిన డబ్బును వెనక్కి తీసుకువచ్చారు. మరి శ్రీవారి ఆలయంలో దొంగతనం చేసిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే..

ఆలయంలో చోరి చేసిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన వేణు లింగంగా గుర్తించారు. అతడు శంకరన్ కోవిల్ నివాసి అని సమాచారం.. నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈయన స్వామి వారి ఆలయం నుంచి డబ్బును దొంగతనం చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ రికార్డులలో పోలీసులు గుర్తించారు. అయితే అదే రోజు సాయంత్రం 6:00 సమయంలో పోలీసులు నిందితుడిని పట్టుకొని దొంగలించిన డబ్బును వెనక్కి తీసుకువచ్చారు.

ఈ విధంగా ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేసి అసలు విషయం బయటకు లాగారు. అయితే హుండీ నుంచి ఆ యువకుడు 15 వేల రూపాయలను దొంగలించినట్లు తెలుస్తోంది. అయితే ఆ డబ్బును తిరిగి పోలీస్ అధికారులకు ఇచ్చారు. ఇలా కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగిందనే విషయం తెలియడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇక ఈ విషయం గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.