Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2024 వేలంలో సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు వయసు వివాదం చుట్టూ చిక్కుకున్నాడు. 12 సంవత్సరాల 308 రోజుల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 1.1 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. దీంతో సూర్యవంశీ, ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన వేలంలో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన సూర్యవంశీపై ప్రస్తుతం వయసు తారుమారుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ కఠినంగా స్పందించారు. మోసం చేశారన్న విమర్శలను ఖండించిన ఆయన, తన కుమారుడి వయసు నిర్ధారణ కోసం మరలా పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
“సూర్యవంశీ ఎనిమిదిన్నర ఏళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్ట్‌లో పాల్గొన్నాడు. అండర్-19 మ్యాచ్‌లలో అతని ప్రదర్శనకి ఎవరూ సందేహించలేరు. నిజాయితీకి అనుగుణంగా ఉన్నాం, మాకు ఏ మాత్రం భయం లేదు,” అని సంజీవ్ అన్నారు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఇటీవల ఆసీస్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.
అండర్-19 టెస్టుల్లో అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, 12 ఏళ్ల 284 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా తన పేరు నిలిపాడు. అతని భవిష్యత్ ప్రతిభపై క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ, వయసు వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆరోపణల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. బిసిసిఐ పరీక్షలో ఇప్పటికే అతని వయసు ఎంత అనేది నిర్దారణ జరిగింది. ఇక వైభవ్ ఐపీఎల్ లో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.