సినీ నటి విజయశాంతి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో వున్నారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితిగా మారింది) నుంచి లోక్ సభ సభ్యురాలిగా పని చేశారు. గులాబీ పార్టీలోనే వుండి వుంటే, విజయశాంతిని ఏ మంత్రి పదవిలోనో చూసి వుండేవాళ్ళమేమో.!
భారతీయ జనతా పార్టీలో వుండడం వల్ల విజయశాంతి రాజకీయంగా ఏం బావుకున్నారో ఆమెకైనా తెలుసో లేదో.! విజయశాంతి అభిమానులు మాత్రం, తమ అభిమాన నటి, నాయకురాలు.. ఇలా అప్రాధాన్యమైన రీతిలో రాజకీయాలు చేయడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించారు విజయశాంతి. ఆ తర్వాత మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళలేదు. అయితే, ఆమెతో ఓ సినిమా చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందిట. ఓ యువ దర్శకుడు కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది.
రాజకీయ నేపథ్యమున్న కథాంశంతో సినిమా ప్లాన్ చేశారట. అయితే, ప్రస్తుతం సినిమాల గురించి ఆలోచించడంలేదని విజయశాంతి అంటున్నారట. త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోపు సినిమా పూర్తి చేసేద్దామని గతంలోనే ప్రతిపాదన వెళ్ళిందట విజయశాంతికి.
అయితే, ఇప్పుడేమో సమయం దాదాపుగా అయిపోయింది. అయినాగానీ, సదరు నిర్మాణ సంస్థ ఆమెతో సంప్రదింపుల కోసం ప్రయత్నిస్తూనే వుందట. అసెంబ్లీ ఎన్నికలకు కాదుగానీ, పార్లమెంటు ఎన్నికల నాటికి అయితే, తనకూ రాజకీయంగా లాభసాటి వ్యవహారం అవుతుందనే ఆలోచనలో విజయశాంతి వున్నారన్నది ఇన్సైడ్ సోర్సెస్ కథనం. కానీ, విజయశాంతి ఏదీ ఓ పట్టాన ముందుకు నడవనివ్వరు. అదే ఆమెతో సమస్య.