Kavitha: తాను చెప్పింది అబద్ధమైతే శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతా: కవిత కల్వకుంట్ల

Kavitha: తాను చెప్పిన మాట అబద్ధమని రుజువైతే కనుక తాను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె ఇందిరా పార్కులో నిర్వహించిన బీసీ మహాసభ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లను కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ గురించి ఆలోచించడం కూడా మానేసారని ఇదివరకే మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా బీసీ రిజర్వేషన్ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఎలా నిర్వహిస్తారో తాము చూస్తాము అంటూ కాంగ్రెస్ నాయకులకు ఈమె వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక జనవరి మూడో తేదీ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ఈ మహాసభలో కవిత మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని.. ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసినటువంటి ద్రోహం పై తాను అబద్ధం చెప్పానని కనుక రుజువైతే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని తెలిపారు.

దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే.. అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని తెలిపారు. కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే బీసీల గురించి ఆలోచించి వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేశాయే తప్ప జాతీయ పార్టీలు ఏవి కూడా బీసీలకు న్యాయం చేయలేదని తెలిపారు. రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అంటూ కాంగ్రెస్ మాట ఇచ్చింది. కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. బీసీ లెక్కల పై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ మాత్రం రిపోర్టులు ఇస్తున్నాయి అంటూ కవిత మండిపడ్డారు.