ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దూకుడైన పనితీరుతో ప్రభుత్వం పనితీరులో కొత్త మార్గాన్ని చూపిస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్, రహదారులు, నీటి సౌకర్యాలు, ఉపాధి హామీ పథకాలపై ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర నిధులకే కాకుండా కేంద్రం కేటాయించిన ప్రతి రూపాయిని కూడా పూర్తిగా వినియోగిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోసం సంక్రాంతి నాటికి రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని పవన్ సంకల్పించారు. ఇది కాకుండా నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, సంబంధిత అధికారులను కూడా కఠినమైన నియంత్రణలో ఉంచారు. ఈ చర్యల వల్ల అభివృద్ధి పనుల్లో స్పష్టత, నాణ్యత పెరుగుతుండటమే కాకుండా, ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనానికి కొత్త ఒరవడి ఏర్పడింది.
పవన్ కల్యాణ్ నాయకత్వంలో కేంద్రం నుంచి వడివడిగా నిధుల విడుదల జరగడం గమనార్హం. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా 446.49 కోట్ల రూపాయలు విడుదల చేయడం పవన్ విజయాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ నిధులతో రాష్ట్రంలోని 1397 గ్రామపంచాయతీలు, 650 మండల పరిషత్తులు, 13 జిల్లా పరిషత్తుల అభివృద్ధి వేగవంతం కానున్నాయి.
ఆరు నెలల పాలనలోనే ఈ స్థాయి నిధులను సాధించడం పవన్ కల్యాణ్ పనితీరుకు ప్రధాన ఉదాహరణ. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు ఈ నిధులను సద్వినియోగం చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పవన్ కృషి కొనసాగిస్తున్నారు.