Prashanth Neel: ఇసారి ఆ తప్పు జరగదు : ప్రశాంత్‌నీల్‌

ప్రభాస్‌ ‘సలార్‌’ సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చివర్లో దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ ‘సలార్‌ 2 శౌర్యాంగపర్వం’ను కూడా ప్రకటించేశాడు. దాంతో అభిమానులు సెకండ్‌ పార్ట్‌ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో వారందరికోసం ‘సలార్‌ 2’ అప్‌డేట్‌ని ఇచ్చేశారు ప్రశాంత్‌నీల్‌. ఆయన మాట్లాడుతూ ‘సలార్‌’ భారీ విజయాన్ని సాధించినా.. ఒక దర్శకుడిగా ఆ సినిమా విషయంలో పూర్తి సంతృప్తిగా లేను. ఎక్కడో ‘కేజీఎఫ్‌’ ఛాయలు ఆ సినిమాలో కనిపిస్తుంటాయి. ‘సలార్‌ 2 శౌర్యాంగపర్వం’లో మాత్రం ఆ తప్పు జరగదు. ఓ కొత్త సినిమాను ప్రేక్షకులు చూస్తారు” అని చెప్పుకొచ్చారు.

ఇంకా మాట్లాడుతూ ‘ఈ కథ రాసుకున్నప్పుడే రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఇది దేవా- వరదా అనే ఇద్దరు స్నేహితుల కథ. మలుపులు, కుదుపులు లేకపోతే కథ రక్తికట్టదు. స్నేహం సాఫీగా సాగితే కిక్కుండదు. అందుకే.. కష్టమైనా సరే.. వారిద్దర్నీ విడగొట్టాలి. వారి మధ్య ఓ పెద్ద అపార్థం సృష్టించాలి. ఒకరినొకరు అపార్థం చేసుకోవాలి. శత్రువులుగా మారాలి. ఈ తర్వాత ఏమైంది? అనేది తెరపైనే చూడాలి. దాన్ని ఇప్పుడే రివీల్‌ చేయలేను.’ అంటూ నవ్వేశారు ప్రశాంత్‌నీల్‌.