తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎంత స్పెషలో అందరికీ తెలిసిందే. వరుసగా సెలవులు ఉంటాయి దానికి తోడు కుటుంబంతో కలిసి గడపాలి అనుకునే వారికి సినిమా మంచి ఆప్షన్ కావడంతో దాదాపు అందరి చూపు సినిమాల పైనే ఉంటుంది. దాంతో అన్ని సినిమాలకి వసూళ్లు బాగుంటాయి. చాలామంది హీరోలు, దర్శక,నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీస్ చేయాలని పోటీ పడుతూ ఉంటారు.
అందులో భాగంగానే బాలకృష్ణ డాకు మహారాజ్ టైటిల్ తో, వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం టైటిల్ తో, రామ్ చరణ్ గేమ్ చేంజర్ టైటిల్ తో, సందీప్ కిషన్ మజాకా టైటిల్ తో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. అయితే మిగిలిన మూడు సినిమాల కన్నా ముందుగా వచ్చేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కావటంతో ఆ సినిమా భవిష్యత్తుని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాకి మంచి హైప్ ని తీసుకురావడంతో తెలుగు సినిమాలతో పెద్దగా ఈ సినిమాకి పోటీ లేదు.
కానీ తమిళంలో ఈ సినిమాకి గట్టి పోటీని ఇవ్వబోతున్నాడు అజిత్. విధాముయార్చి సినిమాతో జనవరి 10న కోలీవుడ్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు అజిత్. నిజానికి అజిత్ తమిళంలో సినిమా టాక్ తో సంబంధం లేకుండా వంద కోట్లు రాబట్టగల హీరో కానీ తెలుగులో అతనికి అంత పెద్ద మార్కెట్ లేదు. అయితే తమిళంలో మాత్రం గేమ్ చేంజర్ మూవీ కి అజిత్ సినిమా గట్టి పోటీ అని చెప్పాలి. అలాగే గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు థియేటర్ల పరంగా కూడా చిక్కులు తప్పవు.
ఎందుకంటే అజిత్ క్రేజ్ దృష్ట్యా, తమిళనాడు, కేరళలో ఎక్కువ స్క్రీన్లు తనకు కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తారు. ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. నిజానికి పొంగల్ రేసులో గుడ్ బ్యాడ్ అగ్లీని దింపాలని మైత్రి మేకర్స్ శతవిధాల ప్రయత్నించారు. కానీ విదాముయార్చి ఇప్పటికే విపరీతమైన ఆలస్యం కావడంతో అజిత్ ప్రాధాన్యత దీనివైపే మొగ్గు చూపింది. దీంతో నెంబర్ మారిపోయింది. అజిత్ వర్సెస్ రామ్ చరణ్ రేస్ లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి మరి.