Virat Kohli: బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీ కొంస్టాస్ వివాదం

బాక్సింగ్ డే సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న భారత్ అస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఆసీస్ అరంగేట్ర బ్యాటర్ సామ్ కొంస్టాస్ మధ్య జరిగిన సంఘటన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఆట తొలి రోజు ఓవర్ ముగిసిన అనంతరం కొంస్టాస్ క్రీజ్ మారుతున్న సమయంలో, కోహ్లీ అతడిని భుజంతో ఢీకొట్టడం వివాదానికి కారణమైంది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్ తదితరులు కోహ్లీ ప్రవర్తనను తప్పుబడుతూ, ఇది ఆటపట్ల గౌరవాన్ని తగ్గించే చర్య అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందిస్తూ, ఈ సంఘటనపై పర్యవేక్షణ జరుపుతున్నట్లు ప్రకటించింది. ఐసీసీ రూల్‌బుక్ ప్రకారం, లెవల్-2 నిబంధన కింద ఈ ఘటనకు విచారణ జరిపే అవకాశం ఉంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో శారీరకంగా ఎదుటి ఆటగాడిని తాకడం అనుచిత ప్రవర్తనగా పరిగణించబడుతుంది. ఈ ఘటన ఉద్దేశపూర్వకమా లేదా నిర్లక్ష్యమా అనే కోణంలో మ్యాచ్ రిఫరీ ఆలోచన చేస్తారు. లెవల్-2 నిబంధన ఉల్లంఘనగా పరిగణించబడితే కోహ్లీకి 3-4 డీమెరిట్ పాయింట్లు వేసే అవకాశం ఉంది. ఇది జరిగితే అతనిపై మ్యాచ్ నిషేధం కూడా విధించబడవచ్చు.

ఇదే సమయంలో, కోహ్లీ అభిమానులు అతని పట్ల మద్దతు తెలుపుతూ, ఇది కేవలం తప్పిదం అని అంటున్నారు. అయితే, క్రికెట్‌లో ప్రతిష్ఠను కాపాడేందుకు ఈ ఘటనపై చర్చ తప్పనిసరి అయ్యింది. ఐసీసీ తుది నిర్ణయం ఎంత త్వరగా వెలువడుతుందో చూడాలి. అటు ఆటలో కూడా భారత్ తమ ప్రదర్శనను మెరుగుపరచి మ్యాచ్‌పై పట్టు సాధించాలన్న దిశగా కృషి చేస్తోంది.