YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున తన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యలను తెలియజేస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల సమస్యలన్నింటిని కూడా వింటున్నారు.
ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది అయితే ఈ ఆరు నెలల కాలంలో ఇచ్చిన హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది ఇదే విషయం గురించి జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఈయన పర్యటనకు కూడా సిద్ధమైన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ రెండు రోజులపాటు బస చేస్తూ అక్కడ ప్రజల సమస్యలను అడిగి మరీ తెలుసుకోబోతున్నారు.
ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే రైతుల కోసం ధర్నా చేశామని ఈ నెల 27న కరెంట్ బిల్లులపై మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత తాను మరి ఇంత తొందరగా ప్రజలలోకి వెళ్తానని ఎప్పుడూ భావించలేదని తెలిపారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజలపై అధిక భారం మోపుతున్నారని జగన్ తెలిపారు.
2027లో జమిలి ఎన్నికలు అంటున్నారని.. దీంతో నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోందని జగన్ అన్నారు. మనం మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా మన ప్రభుత్వ హయామంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. జిల్లాల పర్యటనలో నేతలతో నేరుగా కార్యకర్తలతోనే జగన్ సమావేశం కానున్నారు. సంక్రాంతి తరువాత ఈ పర్యటన ప్రారంభం కాబోతుందని జగన్ తెలిపారు.