Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సినీ సెలబ్రిటీలు ఈరోజు ఆయనని కలిసి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ల రేట్లు పెంపుకు ఏ విధమైనటువంటి అనుమతి ఉండదని ఇటీవల అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా జరిగిన సంఘటన తర్వాత రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నిర్ణయం తర్వాత సినిమా సెలబ్రిటీలు రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయంపై మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏమాత్రం మార్పు ఉండదని ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇక ఇండస్ట్రీకి కూడా తమ ప్రభుత్వం మద్దతు అన్ని విధాలుగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇక ఈ భేటీలో భాగంగా అల్లు అర్జున్ గురించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పై కోపంతోనే రేవంత్ రెడ్డి తనని అరెస్టు చేయించారు అనే వాదన ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుంది. బన్నీ నాకు చిన్నప్పటినుంచి తెలుసు నాతో పాటు కలిసి తిరిగాడు. మా మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా చట్ట పరంగా వ్యవహరించాలనేదే నా అభిప్రాయం అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి సినీ పెద్దల భేటీలో మాట్లాడారు.
ఇలా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా చోటు చేసుకున్నటువంటి ఈ అంశం పట్ల తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో టాలీవుడ్ అయోమయంలో పడింది. మరి ఈ నిర్ణయం పట్ల సినిమా సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సిందే.