ఆయన శైలిని ఎవరు అనుకరించలేరు.. శ్యామ్ బెనెగల్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన పవన్ కళ్యాణ్!

భారతీయ సినీ పరిశ్రమ మరొక లెజెండరీ డైరెక్టర్ ని కోల్పోయింది. తెలంగాణ ఆత్మని తెరపై ఆవిష్కరించిన అతికొద్దీ గొప్ప డైరెక్టర్ లలో ఒకరైన శ్యామ్ బెనగల్ 90 సంవత్సరాల వయసులో డిసెంబర్ 23 సాయంత్రం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. అంకుర్,భూమిక, నిశాంత్, మండి, మంధన్ సహా ఎన్నో సినిమాలను కెరకెక్కించిన ఈ మహానుభావుడికి పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు అనేక సార్లు జాతీయ అవార్డులు కూడా లభించాయి.

యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ గా కెరియర్ ని ప్రారంభించిన శ్యామ్ దృష్టి మాత్రం సినిమాల మీదే ఉండేది. ఆర్టిఫిషియల్ సినిమాలు కాకుండా సమాజంలోని పాత్రలని వాస్తవికంగా తెరపై చూపించాలనుకున్న దర్శకుడు శ్యామ్. హైదరాబాదులో ఫిలిం సొసైటీ ప్రారంభించిన ఘనత కూడా ఈయనదే. అలాంటి ఈ మహానుభావుడి మృతి పట్ల పలువురు సినీ రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన సానుభూతిని ప్రకటించారు.

వాస్తవానికి అద్ధం పట్టే కథలతో భారతీయ సినీ ప్రపంచానికి విలక్షణమైన దిశ చూపించిన దగ్గర దర్శకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన వార్త వినడం విచారకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. 1976లో అమూల్ పాల రైతుల సహకారంతో రెండు రూపాయలు చొప్పున సేకరించిన నిధులతోనే మంధన్ అనే అత్యుత్తమ చిత్రాన్ని నిర్మించాలని తెలుసుకున్నప్పుడు నాకు ఎంతగానో ఆశ్చర్యం వేసింది.

ఆయన తను తీసిన చిత్రాలతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేశారు. వారి చిత్రాలు శైలిని మరెవ్వరు అనుకరించలేని విధంగా వారి ప్రతిభను చాటుకున్నారు. ఆయన తెరపై ఆవిష్కరించిన కథలు పాత్రలు సమాజంలో ఉన్న సమస్యలను ప్రతిబింబించేలా ఉంటాయి. శ్యాం బెనెగల్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను వారి స్మృతులు ఎల్లకాలం మనతోనే ఉంటాయి అంటూ తన సంతాపాన్ని తెలియజేశారు పవన్ కళ్యాణ్.