కరోనా కట్టడిలో కేరళలా మనం ఎందుకు విజయవంతం కాలేకపోతున్నాం ?
కరోనా వైరస్ మన దేశంలో బయటపడిన కొత్తల్లో అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతూ వచ్చాయి. జనవరి 30న మొదటి కేసు నమోదైన దగ్గర్నుండి కేరళపైనే అందరి దృష్టీ పడింది. ఇక కేరళ సంగతి అంతే అనుకున్నారు అందరూ. కానీ కేరళ ఆనతికాలంలోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. ఎంతలా అంటే ఇతర రాష్ట్రాల్లో కేసులు 10లు, 100లు దాటి వేల సంఖ్యలోకి వెళ్లినా కేరళలో 500లకు మించలేదు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 724 కాగా వారిలో 512 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఇక కరోనా మృతుల సంఖ్య కూడా 4గానే ఉంది.
ఇంత త్వరగా కేరళ కరోనాను అదుపు చేయడం వెనుక అప్పటికప్పుడు జరిగిన మ్యాజిక్ లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల దీర్ఘకాలిక కృషి, దార్శనికత ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనిస్టుల కష్టం ఉంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న పినరయి విజయన్ సహా సీపీఎం తరపున ముఖ్యమంత్రులుగా పనిచేసినవారి ఘనత ఉంది. వీరంతా ప్రజారోగ్యం పట్ల పెట్టిన దృష్టి మామూలిది కాదు. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా ప్రజల ఆరోగ్యం పట్ల కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులు విశేషమైన శ్రద్ద వహించారు.
క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భారీ మొత్తంలో నిధులు విడుదల చేయడం, వాటిలో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత ఉండేలా చూడటం, ప్రజలని ఆ కేంద్రాలకు దగ్గర చేయడం వంటివి చేశారు. అధికారిక లెక్కల ప్రకారం కేరళ ప్రజల్లో 48 శాతం మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు పొందుతున్నారట. ఇంత పెద్ద మొత్తంలో జనం ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పట్ల నమ్మకం ఉంచడం గొప్ప విషయం. అదే మన రాష్ట్రాల్లో చూసుకుంటే సర్కార్ వైద్యం నిరు పేదలకు మాత్రమే.. అదీ గత్యంతరం లేక చేయించుకునేదే అన్నట్టు ఉంది పరిస్థితి. పైగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో అందరినీ కార్పొరేట్ వైద్యం వైపే మళ్లిస్తున్నారు.
కేరళలోని ప్రతి ప్రాథమిక కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వీరు ఉదయం, సాయంత్రం కూడా పనిచేస్తారు. ఇక ఈ కరోనాపై పోరు కోసమే ప్రత్యేకంగా 4000లకు పైగా వైద్యులను అదనంగా నియమించింది అక్కడి ప్రభుత్వం. పట్టణ, ప్రాదేశిక, తాలూకా ఆరోగ్య కేంద్రాల్లో కూడా పరిస్ఠితి ఇలానే ఉంటుంది. కేరళలో సుమారు 2 లక్షల మంది వాలంటీర్లు ఆరోగ్య వ్యవస్థ కోసమే పనిచేస్తున్నారు. వీరంతా ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య స్థితిగతులను అంచనా వేస్తూ సంపూర్ణ నివేదికను ప్రభుత్వాలకు అందిస్తుంటాయి.
వీళ్లు మాత్రమే కాకుండా కార్యకర్తలు కూడా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన స్పూర్తితో స్వచ్చంధంగా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో అక్కడి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఉంది కాబట్టే సుమారు 80,000 మందిని అబ్జర్వేషన్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారు. ఇదీ కూలంకషంగా కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడం వెనకున్న రహస్యం. ఇప్పటికిప్పుడు మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య వ్యవస్థను కేరళ స్థాయిలో పటిష్టం కావడం సాధ్యంకాదు కాబట్టి భవిష్యత్తులో కరోనా లాంటి విపత్తులు సంభవిస్తే తట్టుకుని నిలబడడానికి ప్రజా వైద్య వ్యవస్థను అభివృద్ది చేసుకుంటే మంచిది. ఈ తరహా వైద్య వ్యవస్థ ఆవస్యకతను గ్రహించిన సీఎం వైఎస్ జగన్ రూ.16,500 కోట్లను కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కోసం కేటాయించడంతో పాటు 10000 వైఎస్సార్ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నారు.