మలయాళ సినిమా, సీరియల్స్ తో బాగా పాపులర్ అయిన నటుడు దిలీప్ శంకర్ ఆకస్మికంగా మృతి చెందారు. ఒక మంచి నటుడు ఇక లేరని వార్త తెలిసి మలయాళ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. దిలీప్ శంకర్ స్వస్థలం ఎర్నాకులం ఇతను అనేక మలయాళ సీరియల్స్ లో నటించాడు. అమృతాతో, పంచాగ్ని, సుందరి వంటి సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలలో కూడా నటించారు దిలీప్ శంకర్. కాగా పంచాగ్ని సీరియల్ షూటింగ్ కోసం దిలీప్ ఎర్నాకులం నుంచి తిరువనంతపురం వెళ్లారు.
షూటింగ్ రెండు రోజులు నిలిపివేయడంతో తిరువనంతపురంలోనే ఒక ప్రైవేట్ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న దిలీప్ శంకర్ రెండు రోజుల క్రితం చెకిన్ చేశారు. ఆ తర్వాత దిలీప్ శంకర్ కనిపించకుండా పోయారు. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన చావు వెనుక ఎలాంటి అసహజ కారణాలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఆయనకు శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయని, చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్తున్నారు అతని సన్నిహితులు. ఇక దిలీప్ సినిమాలు గురించి చెప్పాలంటే చెప్పా కురిషు, నార్త్ 24 వంటి సినిమాలలో నటించి మెప్పించారు. అమ్మయ్యరియతే లో పీటర్ పాత్రకి మంచి ప్రశంసలు అందుకున్నారు.
ఆయన చివరిసారిగా పంచాగ్ని సీరియల్లో చేసిన చంద్రసేన పాత్ర కూడా అందరిని అలరించింది. ఆయన సహనటీ సీమ జి నాయర్ తన సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. అయితే ఆయన చావుకి గల అసలు కారణాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తాయి అంటున్నారు పోలీసులు. ఇక సోషల్ మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు ఆయన అభిమానులు.