నూతన సంవత్సర వేళ చైనాలో “హ్యూమన్ మెటానియా వైరస్” (హెచ్ఎంపీవీ) వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వైరస్ కారణంగా వేలాదిమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరస్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కలిగించడంతో పాటు ఇన్‌ఫ్ల్యూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వంటి ఇతర వైరస్‌ల బారినపడే ప్రమాదం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
చైనాలో హ్యూమన్ మెటానియా వైరస్ ప్రభావం వేగంగా విస్తరిస్తుందని, దీని కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు శ్వాస సమస్యలు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రులపాలవుతున్నారని సమాచారం. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఈ వైరస్ బారినపడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అంతేకాదు, కొవిడ్‌కు సమానమైన లక్షణాలతో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడం ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతోంది.
చైనా ప్రభుత్వం ఈ వైరస్ మూలాలను అర్థం చేసుకునేందుకు ప్రత్యేక పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి గురించి శాస్త్రవేత్తలు, డాక్టర్లు పరిశీలనలు చేపట్టారు. నిమోనియా తరహా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు చైనా ఆరోగ్య వ్యవస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది. అయితే, అధికారిక ప్రకటనలలో ఈ వైరస్ ప్రభావంపై పూర్తి సమాచారం అందించకపోవడం గమనార్హం. ఇదే సమయంలో చైనా ప్రభుత్వం వైరస్ విస్తరణను నియంత్రించేందుకు పలు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కానీ సోషల్ మీడియా, అంతర్జాతీయ వార్తా సంస్థల ద్వారా వస్తున్న ఈ కథనాలు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.