శివోహం.. కార్తీకం వచ్చిందంటే చాలు అంతటా శివనామస్మరణ జరుగుతుంది. ఈ మాసంలో శివార్చన, అభిషేకం అత్యంత విశేష ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రస్తుత ఆధునిక కాలంలో నియమాలు పాటించి శివపూజ, అభిషేకం చేసుకోలేని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే వీరందరూ శివమానస పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
ఆ విశేషాలు తెలుసుకుందాం…
శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు. అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు. వృధ్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేక పోయినా, చెయ్యాలనే తపన మాత్రమున్నవాళ్ళుమరి ఏం చెయ్యాలి? ధర్మ గ్రంధాలు ఏం చెబుతున్నాయి? అసలు భగవంతుని పూజలో మానసిక పూజే విశేషమైనది. మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా వుండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి.అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి, భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికిభగవంతుడు కల్పించిన అవకాశంగా దాన్ని భావించి మానసిక పూజ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలి? భగవంతుడు అక్కడ వున్నాడని భావించి ఆయనకి రత్న సింహాసనం వెయ్యాలి. ఆకాశ గంగని తెచ్చి మనసారా అభిషేకించాలి. వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి. సుగంధ భరితమైన పూవులతో, మారేడ దళాలతో పూజించాలి. ధూపం, దీపం అన్నీ సమర్పించాలి. షడ్రషోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి. స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నన్ను దయచూడమని వేడుకోవాలి. బాహ్యంగా విశేష పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు. శివమానస పూజ వల్ల విశేష ఫలితాలు వస్తాయి. శివానుగ్రహం లభిస్తుంది.