ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో మమేకమవుతున్నారు. ప్రజలు కూడా ఆయనపై అభిమానం కురిపిస్తున్నారు. పాదయాత్ర ప్రజల్లో జగన్ క్రేజ్ పెంచింది. నవంబర్ లో ఈ పాదయాత్ర ముగియనుంది. ఆ తర్వాత జగన్ ఏం చేయనున్నాడు? ఇప్పుడు ప్రజల్లో పెరిగిన క్రేజ్ కాపాడుకోవడానికి జగన్ ఎలా ముందుకెళ్లనున్నాడు? అసలు జగన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే జగన్ కూడా తన నెక్స్ట్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. వైసిపి పార్టీ కార్యకలాపాలన్నీ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లోటస్ పాండ్ లోని పార్టీ ఆఫీస్ నుండి జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత అక్కడ నుండి రాజకీయాలు నడపడం, ప్రజలకు దూరంగా ఉండటంపై విమర్శలు కూడా వినిపించాయి. అయితే టిడిపి మాత్రం పూర్తి స్థాయిలో అమరావతిలో పాగా వేసింది.
కాగా జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుండి ఆ విమర్శలకు అడ్డుకట్ట పడింది. జగన్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ…వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలు కూడా ఆయనను ఆదరిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగాలంటే పాదయాత్ర తర్వాత కూడా జగన్ ఏపీ ప్రజలకు చేరువగా ఉండాలి. అందుకే ఆయన మంగళగిరి సెంటర్ గా కార్యకలాపాలు చేయనున్నారు.
ఎలాంటి హడావిడి లేకుండా గతేడాది తాడేపల్లిలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వైసీపీ వారు. పార్టీ ఆఫీసుకి దగ్గరలోనే వైసీపీ అధినేత జగన్ ఇంటి నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ రెండింటి నిర్మాణం త్వరగా కానిచ్చేసి దసరాకి వాటిలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారు జగన్. ఆయన పూర్తి స్థాయిలో రాజధానిలో ఉండే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా కార్యకర్తలను కలుసుకోవడానికి, ప్రజల్లోకి నేరుగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది వైసిపి అధినేత జగన్ కి. తమ అభిమాన నాయకుడు రాజధానిలో తమకు చేరువగా రానున్నారని సంతోషంలో ఉన్నారు అభిమానులు, వైసిపి శ్రేణులు.