Kohli – Uthappa: భారత క్రికెట్ లో జరిగిన పలు వివాదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచ కప్ సమయాన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేసి అంబటి రాయుడిని పక్కన పెట్టడంపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. తాజాగా, మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించి, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీపై నేరుగా ఆరోపణలు చేశారు. కోహ్లీ తన ఇష్టానుసారంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకునేవాడని, రాయుడిని జట్టులోకి తీసుకోకపోవడంలో అతని పాత్ర ఉందని అన్నారు.
ఉతప్ప మాటల ప్రకారం, కోహ్లీకి ఎవరికైనా నచ్చకపోతే, వారిపై నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేవాడని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ‘‘రాయుడి విషయంలోనూ ఇదే జరిగింది. అతడు తన ప్రపంచ కప్ కిట్ బ్యాగ్‌ను చూసి ఆ కప్ లో ఆడతానని నమ్ముకున్నాడు. కానీ, చివరికి అతని కలలు కల్లలయ్యాయి,’’ అని ఉతప్ప పేర్కొన్నారు. సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్ పేరు పెద్దగా చర్చలో ఉన్నప్పటికీ, అసలు బాధ్యుడు కోహ్లీ అని ఉతప్ప చెప్పిన ఈ వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిర్చాయి.
రాయుడి చోట విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై అప్పట్లో సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘త్రీ డైమెన్షన్ ఆల్‌రౌండర్’’ అనే పేరుతో సెలక్టర్లు విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాయుడు అయితే మెరుగైన ఆటగాడని, అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడేదని అభిమానులు చెప్పారు. ఈ సంఘటనపై ఉతప్ప తాజా కామెంట్లు క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చలకు తావిచ్చాయి.
‘‘జట్టులో ఎవరి అవకాశాలపై కూడా ఇష్టాయిష్టాలతో ప్రభావం చూపకూడదు. అంబటి రాయుడి విషయంలో జరిగినది న్యాయంగా కాదని నా అభిప్రాయం,’’ అని ఉతప్ప స్పష్టం చేశారు. కోహ్లీపై ఈ ఆరోపణలు మరింత వివాదానికి దారి తీసే అవకాశముంది. మొత్తానికి, రాయుడు జట్టులో చోటు కోల్పోవడంపై ఇప్పటికీ క్రికెట్ అభిమానుల్లో నిరాశ కొనసాగుతూనే ఉంది. ఉతప్ప వ్యాఖ్యలు ఈ సమస్యపై మరింత చర్చనీయాంశం కావడం ఖాయం.