No Helmet No Petrol: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచనలతో రాష్ట్ర రవాణా శాఖ హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ అందించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన అమలుకు పెట్రోల్ పంపుల యాజమాన్యాలను కఠినంగా ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రతి ఏడాది 26,000 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల్లో అధిక శాతం హెల్మెట్ లేకపోవడమే ప్రధాన కారణమని గుర్తించిన సీఎం యోగి, హెల్మెట్ ధారణను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ సర్క్యులర్ ద్వారా ప్రతి జిల్లాలో అధికార యంత్రాంగం ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేయనుంది.
ఇక ఇటు తెలంగాణలో హెల్మెట్ ధారణ గురించి అవగాహన పెంచుతూ పోలీసులు చలానాలు వేస్తున్నా, ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనేక మంది ప్రధాన కూడళ్లలో మాత్రమే హెల్మెట్ ధరించి, ఆ తర్వాత హెల్మెట్‌ను తీసేస్తున్న ఘటనలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ప్రభుత్వం హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరిగా అమలు చేస్తోంది.
ట్రాఫిక్ పోలీసులు బైకర్లకు అవగాహన కల్పించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో హెల్మెట్ స్టాకులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ అందించవద్దనే నిబంధనను తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జనజాగృతి కల్పించడమే కాదు, నిబంధనల అమలు పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.