విజయనగరం జిల్లాలో ఆంధ్ర ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. సోమవారం విజయ నగరం జిల్లాలో ఏడవరోజు పాదయాత్ర విజయనగరం నియోజకవర్గంలో సాగింది. జిల్లా సెంటర్ లో పైడితల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ భహిరంగ సభలో మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు జగన్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని దుయ్యబట్టారు.
వైసిపి అధికారంలోకి వస్తే పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీలు కురిపించారు. మాట తప్పను… మడమ తిప్పను అనే నినాదంతో పాదయాత్రలో ముందుకు వెళుతున్న జగన్ విద్యార్థులకు కూడా మాట ఇచ్చి తప్పను, మీ ఉన్నతి కోసం అధికారంలోకి వస్తే అన్ని విధాలా సహకారం అందిస్తాను అన్నారు.
పేద, బలహీన, బడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ ఇస్తామన్నారు. విద్యార్థులు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా స్థిరపడాలి అనే వారి కలలు నెరవేర్చటానికి అన్ని విధాలా సహకారం ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. మిగిలిన 10 శాతం ఆపనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి నాలుగేళ్లు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం చుట్టూ బాబు బినామీలకు భూములు ఉంటాయి. చుట్టు పక్కల ఉన్న రైతుల భూములు లాక్కుంటారు కానీ…బాబు బినామీల భూములు లాక్కోరు అన్నారు జగన్.
భోగాపురం ఎయిర్పోర్టు పేరిట రైతుల వద్ద వందల ఎకరాలు తీసుకుని విమానాశ్రయ నిర్మాణ టెండర్లు ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారని జగన్ పేర్కొన్నారు. విమానాశ్రాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్ గజపతిరాజు ఈ విషయంలో బాబును ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు జగన్. రాష్ట్ర మంత్రిగా పదిహేడేళ్లు, కేంద్రమంత్రిగా నాలుగేళ్లు విధులు నిర్వర్తించిన అశోక్ గజపతిరాజు జిల్లా అభివృద్ధి కోసం ఏం చేసారంటూ నిలదీశారు జగన్. టిడిపి నేతలు ఇసుక దందాలకు, భూదందాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని మండిపడ్డారు జగన్.
ఇదిలా ఉండగా జగన్ ను చూసేందుకు వచ్చిన ఒక 15 సంవత్సరాలున్న బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. జనం కిక్కిరిసి ఉండటంతో జరిగిన తోపులాటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు లాంతర్ల జంక్షన్ వద్ద జగన్ ప్రసంగిస్తున్న సమయంలో బాలుడు జనం మధ్యలో నుండి ముందుకు వచ్చే ప్రయత్నం చేసాడు. ఆ సమయంలో తోపులాట జరగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని స్థానికులు దగ్గర్లో ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకుని జగన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బాలుడి క్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అనుచరులకు తెలిపినట్టు తెలుస్తోంది.