వైసీపీ నాయకుడు విజయ్ సాయిరెడ్డికి మాజీ డీజీపీ సాంబశివరావు షాక్ ఇచ్చారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ని విశాఖ పట్టణం, రాంబిల్లి మండలం, హరిపురంలో సాంబశివరావు కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో వైసీపీలో చేరనున్నట్లు విజయ్ సాయిరెడ్డి ఒక ప్రకటన కూడా చేశారు. మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరనున్నారు. ఆయన చేరికతో పార్టీకి అదనపు బలం చేకూరింది అని ప్రకటించారు విజయ్ సాయిరెడ్డి.
విజయ్ సాయిరెడ్డి ఈ ప్రకటన చేయగానే ఈ విధంగా పుకార్లు షికారు చేసాయి కూడా. కాపు వర్గీయుడు సాంబశివరావు వైసీపీ లో చేరడంతో పార్టీకి బలం చేకూరినట్టు అయ్యింది. సాంబశివరావు ఒంగోలు వాస్తవ్యుడు కావడంతో 2019 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాంబశివరావు పోటీ చేయనున్నట్టు అప్పుడే కధనాలు కూడా వచ్చేశాయి.
అయితే ఈ వార్తలను, విజయ్ సాయిరెడ్డి చేసిన ప్రకటనను ఖండించారు ఎక్స్ డీజీపీ సాంబశివరావు. జగన్ ని కలవటంలో రాజకీయ ప్రాధాన్యం లేదని తెలిపారు. గంగవరం పోర్టు సీఈఓ హోదాలో మర్యాదపూర్వకంగా జగన్ ని కలిశాను అన్నారు. గతంలో పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని కలిశానంటూ గుర్తు చేశారు. ప్రస్తుతానికి నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ స్పష్టం చేశారు సాంబశివరావు.