రెగ్యులర్ మసాలా పోలీసే: బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ (మూవీ రివ్యూ)

‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’
రచన, దర్శకత్వం – నాగసాయి మాకం
తారాగణం : మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, ప్రణవి, గోరటి వెంకన్న, ఆర్ ఎస్ నందా, వైభవ్ తదితరులు 
సంగీతం : సాబూ వర్ఘీస్, ఛాయాగ్రహణం : తోట రమణ 
బ్యానర్ : ఎంఎస్ క్రియేషన్స్ 
నిర్మాత : మహంకాళి శ్రీనివాస్, 
విడుదల :  మార్చి 15, 2019 
2 / 5 
***

        తెలంగాణా నేపధ్య సినిమా అంటే తెలంగాణా సంస్కృతిని చిత్రిస్తూ వస్తున్న కొన్ని సినిమాల లిస్టులో చేరుతూ ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’ అనే పోలీసు కథ వచ్చింది. దీనికి నాగసాయి మాకం అనే కొత్త దర్శకుడు. మాగంటి శ్రీనాథ్ హీరో. టైటిల్ చూస్తే రెగ్యులర్ కంటే ఏదో భిన్నంగా అన్పిస్తోంది. ట్రైలర్ చూస్తే ఆ భిన్నత్వం కాస్తా తగ్గుతోంది. సినిమా చూస్తే…?? సినిమా చూసి విషయమేమిటో తెలుసుకుందాం…

కథ

        సూర్య (మాగంటి శ్రీనాథ్) బిలాల్ పూర్ గ్రామంలో ఎస్సైగా వస్తాడు. రొటీన్ గా నీతీనిజాయితీలు అనేవి అతడి అస్త్రాలు. వాటితో గ్రామంలో పరిస్థితుల్ని చక్కబెట్టాలనుకుంటాడు. అదే పోలీస్ స్టేషన్ లో సురేంద్ర (గోరటి వెంకన్న) హెడ్ కానిస్టేబుల్ గా వుంటాడు. ఇతడి కూతురు శ్రీలత (శాన్వీ మేఘన) అక్కడి స్కూల్లో టీచర్ గా  వుంటుంది. ఈమెని ప్రేమిస్తాడు ఎస్సై సూర్య. ఇలావుండగా వూళ్ళో రెండు సంఘటనలు జరుగుతాయి. ఓ దొంగతనం కేసులో హత్య, ఇంకో అమ్మాయి మిస్సింగ్ కేసు సవాలుగా మారతాయి. ఏమిటీ కేసులు, వీటి వెనుకెవరున్నారు? వీటిని సూర్య ఎలా పరిష్కరించాడు? అన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 

        రొటీన్ మెయిన్ స్ట్రీమ్ ఫార్ములా కథలా వుంది. తెలంగాణా ఫీల్ లేదు. తెలంగాణా నేటివిటీకి, భాషకి ఇలాటి కథలతో వున్న ఒక వెసులుబాటు ఏంటంటే, వీటిని ఫిలిం నోయర్ జానర్ లో ప్రత్యేకంగా తీయవచ్చు. అప్పుడు రెగ్యులర్ వాస్తవిక సినిమాలకీ, మెయిన్ స్ట్రీమ్ సినిమాలకీ భిన్నంగా ఒక ప్రత్యేక ముద్రతో బాక్సాఫీసు దగ్గర శక్తివంతంగా నిలబడే అవకాశముంటుంది. దేశవ్యాప్త దృష్టినీ ఆకర్షించవచ్చు. ఫిలిం నోయర్ వాస్తవిక సినిమా కంటే పవర్ఫుల్లే కాదు, కమర్షియల్ కూడా. ఈ అవకాశాన్ని ఇది కోల్పోయింది.

పాత్రలు, కథా కథనాలు రెగ్యులర్ మసాలా సినిమాలాగా వున్నాయి,  పోలీసు డైలాగులతో బాటు. ఉన్న కథేదో దానిమీదైనా దృష్టి పెట్టకుండా, తెలంగాణా ఆచార వ్యవహారాలంటూ అనేకం చూపిస్తూ కామెడీలు, కొట్లాటలూ పెట్టారు. ఒక బతుకమ్మని, ఇంకో రాబోయే తుపాకీ రాముడ్నిఇందులోకి దింపేసి, సర్వతెలంగాణా సాంస్కృతిక హంగుల కదంబ కార్యక్రమంలా చే శారు, కల్లు కాంపౌండు పాట సహా. ఈ పని చేయడానికి ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వుందని మర్చిపోయారు. ఇంత ఓవరాక్షన్  చేయకుండా  పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటివి తెలంగాణా సినిమా కథలుగా ఓ ప్రత్యేకతని నిలబెట్టుకున్నందు వల్లే, మిగతా రెగ్యులర్ గా వస్తున్న మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాల మధ్య ఫ్రెష్ గా కన్పించి, ఇతర ప్రాంతాల్లో కూడా అంత హిట్టయ్యాయి.

ఇలా తెలంగాణా పోలీసులు ఎలా వుంటారో ఫ్రెష్ గా చూపించే ఆలోచన చేయలేదు ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’  నిర్వాహకులు. 

ఎవరెలా చేశారు 

        హీరో మాగంటి శ్రీనాథ్ తెలంగాణా క్యారెక్టర్ లా కన్పించడు. తెలంగాణా హీరోలు లేరనుకుని ఈ ఎంపికేమో. కానీ  ‘హేపీ డేస్’ ఫేం తెలంగాణా హీరో రాహుల్ వుండనే వున్నాడు. ‘వెంకటాపురం పోలీస్ స్టేషన్’ లో ఆంధ్రా ఎస్సైగా నటించాడు. ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’ కి ట్రాన్స్ ఫర్ చేస్తే సరిపోయేది. మాగంటి శ్రీనాథ్ తెలంగాణా పాత్రగా కన్పించేందుకు ఏ మాత్రం కృషిచేయలేదు. రోటీన్ తెలుగు సినిమా డైలాగులు కొడుతూ, రొటీన్ ‘సిన్సియర్ పోలీసాఫీసర్’ టెంప్లెట్ క్యారెక్టర్ గా చేసుకుపోయాడు. పాటలు డాన్సులు లేకపోవడమొక రిలీఫ్. కానీ మళ్ళీ ఫైట్స్ రెగ్యులర్ మసాలా ఫైట్సే. ఇన్వెస్టిగేషన్ వ్యవహారాల్లో చూపించిన భావోద్వేగాలు కంట్రోల్లో వుంచడం కూడా ఒక రిలీఫే. అయితే అతను కొత్త హీరోగా ఇలాటి అరిగిపోయిన ఫార్ములా పాత్రలు కాకుండా, అప్డేట్ చేసిన పాత్రల్ని పోషించుకుంటే మంచి భవిష్యత్తు వుంటుంది.

 
        హీరోయిన్ శాన్వీ ప్రేమ ట్రాకులో కన్పించే పాత్ర. ఈ లవ్ ట్రాక్ కాస్త ఫ్రెష్ గా వుంటుంది. గోరటి వెంకన్న భోళాతనపు హెడ్ కానిస్టేబుల్ గా ఓకే. డైలాగులు బావున్నాయి. పాటలు గోరటి వెంకన్నతో బాటు, సుద్దాల అశోక్ తేజ, మౌనశ్రీ మల్లిక్ రాశారు. అశోక్ తేజ రాసిన ‘నిద్దుర లేని కళ్లకు అడ్రస్,అలసట లేని కాళ్లకు సిలబస్’ అనే పాట రెగ్యులర్ సినిమాల్లో వుండే పోలీసు ఫార్ములా పాట. తోట రమణ కెమెరా వర్క్ రెగ్యులర్ సినిమాలకి లాగే  వుంది.

 
చివరికేమిటి 

        ఒక షార్ట్ ఫిలిం తీసి సినిమా దర్శకుడైన నాగసాయి ఇంకా సినిమా మీడియాని అవగాహన చేసుకోవాల్సింది చాలావుంది. ముందు తన బ్రాండ్ ఏమిటో నిర్ణయించుకోవాలి. తెలంగాణానా, లేక రెగ్యులరా? తెలంగాణా అనుకుంటే ఏ కథో ఆ కథ జానర్ ఎలిమెంట్స్ తో ప్రత్యేకంగా తీసుకోవాలి. లేదనుకుంటే రెగ్యులర్ మసాలాలు తీసుకోవచ్చు. రెండూ కలిపేసి కలగూరగంప చేస్తే ఎటూ కాకుండా పోవడమే జరుగుతుంది.
        ఈ సినిమాలో చాలా పాత్రలు. అన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ చాలా టైము వృధా చేశాడు. తెలంగాణా గురించి ఎన్నో చెప్పాలన్న అత్యాశతో కథకి అడ్డుపడే చిత్రణలు చేశాడు. పైగా సినిమా నడక అత్యంత  స్లోగా చేశాడు. ఇక కల్లు కాంపౌండు పాట అత్యంత చీప్ గా  వుంది. ఈ రోజుల్లో ఈ పాటల్ని ఎవరు చూస్తారు – వైన్ షాపులకి పోతూంటే. ఇకపోతే అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటి? ఇది కూడా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఇష్టానుసారం తీస్తానంటే తీసుకోవచ్చు, నిర్మాత కూడా ముందుకొస్తే ఇలాగే తీసుకోవచ్చు.

―సికిందర్