నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రంపై అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు నిమగ్నంగా జరుగుతున్నాయి. తొలుత ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని భావించినప్పటికీ, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే పుకార్లు వినిపించాయి. అయితే మేకర్స్ ఈ వార్తలను ఖండించి, సినిమా కొద్ది రోజులు వాయిదా మాత్రమే పడిందని తెలిపారు.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్, టెక్నీషియన్స్ ఎంపిక పూర్తి చేసినట్లు ప్రశాంత్ వర్మ సమాచారం ఇచ్చారు. హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కూతురిని పరిచయం చేసే ఆలోచన ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. విజువల్ స్పెక్టక్యులర్‌గా మలచబోతున్న ఈ సినిమా మోక్షజ్ఞకు పెద్ద స్థాయి ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. మోక్షజ్ఞ పాత్ర ఈ చిత్రంలో వైవిధ్యంగా ఉండనుందని టాక్. ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సైన్స్ ఫిక్షన్ కథనానికి మరో శిఖరం చేరుతారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ తర్వాత, ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పటికే పలువురు దర్శకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో మోక్షజ్ఞ కోసం ప్రత్యేక కథను సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు, బాలకృష్ణ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 కూడా సమర్పణ దశలో ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. మరోవైపు బాలయ్య సంక్రాంతి పండగ సందర్భంగా డాకు మహారాజ్ సినిమాతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.