రాజకీయం, సినిమా.. చెరో వైపు.! కానీ.. ఎలా సాధ్యం జనసేనానీ.?

సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కాదిప్పుడు.! సినిమాల్లోనూ రాజకీయాలున్నాయ్.. రాజకీయాల్లోనూ సినిమాలున్నాయ్.. అన్నట్లు తయారైంది పరిస్థితి. సినిమాలకీ, రాజకీయానికీ.. డేట్లు చెరి సగం కేటాయిస్తున్నట్లుగా వుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు.

నిత్యం జనంలో వుంటేనే, రాజకీయ నాయకుడవుతాడన్నది వెనకటి మాట.! జనాలకీ ఇప్పుడంత తీరిక లేదు. మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మడంలేదు. రాజకీయ నాయకులు చెప్పే మాటల్నీ నమ్మడంలేదు.! కరెన్సీకి అమ్ముడుపోతున్నారని అందర్నీ ఒకే గాటన కట్టడం సరికాదుగానీ, జరుగుతున్నది దాదాపుగా అదే.

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడతారు.? అన్నదానిపై ప్రజల్లో మరీ అంత లోతైన చర్చ జరగడంలేదు. ‘ఎవరో ఒకరు.. ఎన్నికల సమయంలో చూద్దాంలే..’ అనుకుంటున్నారు. రాష్ట్ర సమస్యల్ని ప్రస్తుతానికైతే జనం పెద్దగా పట్టించుకోవడంలేదు. ఏదో అలా నడుస్తోంది లే.. అని సరిపెట్టుకుంటున్నారు.

ఇందుకేనేమో.. జనసేనాని కూడా రాజకీయాల్ని లైట్ తీసుకున్నారు. సినిమాల్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికలకు ఆర్నెళ్ళ ముందర జాతర షురూ చేయొచ్చని బహుశా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారేమో. దానికీ, సినిమాలు ఉపయోగపడతాయన్న భావనలో ఆయన వున్నట్టున్నారు.

సినిమా కబుర్లు.. దానికి తోడు రాజకీయ విమర్శలు.. ఈ రెండూ బాగా బ్యాలెన్స్ అవుతున్నాయి జనసేన పార్టీకి. ఎన్నికల వరకూ ఇదే తంతు.. ఎన్నికల సమయంలో ఇంకా జోరుగా వుండబోతోంది వ్యవహారం.! దీన్ని సినీ, రాజకీయ వ్యూహమని అనుకోవచ్చా.?