తెలంగాణ సర్కార్ కు షాకిచ్చిన హైకోర్టు

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలోని పలు పంచాయతీలను మున్సిపాల్టిల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన  ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ హైకోర్టులో 100కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని హైకోర్టు విచారించింది. అసలు మున్సిపాలిటిల్లో గ్రామాలను విలీనం చేసే అధికారం మీకెక్కడిది అంటూ కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దాంతో ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ అన్ని విధి విధానాలు పాటించాకే విలీనం చేశామని తెలిపారు.

గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి వాటి పరిధిలోని వ్యవసాయేతర రంగాల పై ఆధారపడిన వారి జనాభా, స్థితి గతులు, తలసరి ఆదాయం వంటి వాటిని అధ్యయనం చేయాల్సి ఉందని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. కానీ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా గ్రామాలను మున్సిపాలిటిల్లో విలీనం చేసిందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల గ్రామ పంచాయతీల స్వతంత్రకు భంగం కలుగుతుందన్నారు. విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించి కోర్టు ఇప్పటికే సింగిల్ జడ్జి స్టే ఇచ్చిందని, ఆ గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదన్నారు.

ప్రభుత్వం తరపున ఏఏజి రాంచంద్రరావు వాదనలు వినిపించారు. మున్సిపాలిటిల ద్వారా పంచాయతీలకు తాగునీరు, విద్యుత్ , డ్రైనేజి ఇతర సౌకర్యాలు తొందరగా అందుతాయన్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకొని మున్సిపాలిటిల పరిధి కోసం గ్రామాలను నాశనం చేస్తారా.. మున్సిపాలిటిలో లేకపోతే అభివృద్ది పనులు చేయరా అని ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు జీన్స్, షర్ట్ వేసుకున్నంత మాత్రాన అవి పట్టణ ప్రాంతాలుగా మారిపోవంది. అసలు మీరు చట్ట బద్దంగా అధ్యయనం చేశారా అని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. విలీన గ్రామాలకు ఎన్నికలు జరపాలని ఎందుకు ఆదేశాలు ఇవ్వవద్దో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. గ్రామ పంచాయతీలను చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇప్పుడు ఎన్నికలు జరిపితే మళ్లీ 5 ఏళ్ల వరకు మున్సిపాలిటిల్లో కలిపే అవకాశం ఉండదని రాంచంద్రరావు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. మున్సిపాలిటిల విలీనానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆ గ్రామాలకు ఎన్ని రోజులలో ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. దీంతో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే 21 రోజుల్లో విలీన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో న్యాయమూర్తి కేసును జనవరి 21కి వాయిదా వేశారు.