Actor Hema: రేవ్ పార్టీ కేసులో నటి హేమకు హైకోర్టు ఊరట

తెలుగు నటి హేమకు రేవ్ పార్టీ కేసులో కర్ణాటక హైకోర్టు నుంచి కీలకమైన ఊరట లభించింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెపై డ్రగ్స్ వినియోగానికి సంబంధించి కేసు నమోదవ్వడం, రిమాండ్‌కు వెళ్లడం చర్చనీయాంశమయ్యాయి. అయితే, తాజాగా హైకోర్టు ఆమెపై ఉన్న కేసు చర్యలపై స్టే విధించడం హేమకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది.

న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ చందన గౌడర్ తన తీర్పులో, ఈ కేసులో హేమపై నమ్మకమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సహనిందితుల ప్రకటనల ఆధారంగా మాత్రమే ఛార్జ్ షీట్ దాఖలు చేయడం సరికాదని, న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎంఎండిఎమ్ డ్రగ్ వినియోగానికి సంబంధించి ఆమెపై వచ్చిన ఆరోపణలపై సరైన ఆధారాల్లేకుండా కేసు ముందుకు సాగడాన్ని తప్పుపట్టింది.

ప్రస్తుతం హేమ బెయిల్‌పై ఉండగా, ఈ స్టే నిర్ణయం ఆమెకు తాత్కాలిక ఊరటగా నిలిచింది. కేసు విచారణ పూర్తయే వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చట్టం ప్రకారం నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణ తేదీ ఇంకా ఖరారు కాలేదు. హైకోర్టు నిర్ణయంతో హేమకు తాత్కాలికంగా ఉపశమనం లభించినా, కేసు పూర్తిగా తేలడానికి ఇంకా సమయం పడుతుందని భావిస్తున్నారు.