YSRCP Blame Game : ఫెయిల్యూర్ చంద్రబాబు ఖాతాలో.. సక్సెస్ జగన్ ఖాతాలో.!

YSRCP Blame Game : అచ్చం అప్పట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏం చేశారో, ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయమై జరుగుతున్న రాద్ధాంతం వెనుక వైఎస్ జగన్ రాజకీయ వ్యూహమేంటి.? అన్నదానిపై ఆ పార్టీ నేతలకే అంతుపట్టని పరిస్థితి.

ప్రత్యేక హోదాకి బీజేపీ ఎప్పుడో పాతరేసేసింది. ఆ పాపంలో చంద్రబాబుకీ వాటా వుంది. ఇందులో వైసీపీ వాటా తక్కువేమీ కాదు. అప్పట్లో కేంద్రాన్ని నిలదీయాల్సిన వైసీపీ, చంద్రబాబుని విమర్శించి రాజకీయంగా పబ్బం గడుపుకుంది. టీడీపీ కూడా ఇప్పుడు అదే చేస్తోంది.

కానీ, చంద్రబాబుకీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ మధ్య తేడా చూపించాలంటే, వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిందే. ప్రత్యేక హోదాపై కేంద్ర హోం శాఖ ఓ కమిటీ ఏర్పాటు చేసి, దానికి ఓ ఎజెండా ఫిక్స్ చేసిన విషయం విదితమే. చివరి నిమిషంలో ‘సీన్’ మారిపోయింది.

కేంద్ర హోం శాఖ తొలుత పెట్టిన ఎజెండా తమ ఘనత అని చెప్పుకుంటున్న వైసీపీ, ఎజెండా మారడం వెనుక చంద్రబాబు కుట్ర వుందంటూ ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకి అంత సీన్ వుందా.? అంటే, ‘లేదు’ అనే అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం వుండడం వైసీపీ ఘనత అయితే, ఆ ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగిపోవడం తాలూకు వైఫల్యం కూడా వైసీపీదే అవ్వాలి.

వైఎస్ జగన్ ఒత్తిడితో ఎజెండాలో పెట్టారు.. చంద్రబాబు కుట్రతో ఎజెండాలోంచి పీకేశారని అనడం భావదారిద్ర్యానికి నిదర్శనం. ఈ విషయమై వైసీపీనే విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇలాంటి వ్యూహాలతో వైసీపీ తనను తాను నాశనం చేసుకుంటోందని వైసీపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.