Etela Rajender: రాజకీయ మార్పుల దిశగా ఈటల రాజేందర్?

తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌ ప్రస్తుతం రాజకీయంగా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బీజేపీ వైపు మారిన ఈటల, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ, అనుకున్న విజయాన్ని సాధించలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఎదుర్కొన్నప్పటికీ, తగిన ఫలితాలు రాకపోవడం ఆయనకు ఎదురుదెబ్బగా మారింది.

రాష్ట్ర బీజేపీ నేతృత్వం కోసం ఈటల రాజేందర్ చేసిన ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్న ఆయన అనుబంధం, బీజేపీ అధిష్ఠానం ఆయనకు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయిలో కొన్ని రాజకీయ సమీకరణాలు ఆయన ఎదుగుదలను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఆర్‌ఎస్ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడం, బీజేపీ భావజాలానికి పూర్తి అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఈటలకు ప్రతికూలంగా మారాయి.

అంతేకాదు, ఇటీవల పార్టీ పెద్దలతో ఆయనకు నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆయన అనుచరులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న భావనతో, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఈటలపై అవరోధాలు సృష్టించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈటల తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నప్పటికీ, ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో, ఆయనపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఆయన రాష్ట్ర బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయడం, మీడియాతో తన అసంతృప్తిని పరోక్షంగా వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఈటల రాజేందర్‌ ముందు ఇప్పుడు కీలకమైన నిర్ణయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో కొనసాగి ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలా లేదా తన భవిష్యత్‌ రాజకీయ ప్రస్థానానికి కొత్త దిశను ఎంచుకోవాలా అనే ప్రశ్నలు ఆయనను వెంటాడుతున్నాయి. తన అనుచరులు, శ్రేణులు, స్థానిక నాయకత్వంతో కలిసికట్టుగా ముందుకు సాగి, తన రాజకీయ ప్రస్థానానికి కొత్త మలుపు తిప్పాలనేది ఆయనకు కీలకమైన అంశంగా మారింది. ఈటల రాజేందర్‌ తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.