గల్లంతైపోయిన బీజేపీ ఆశలు.. ఏపీలో బీజేపీ భవిష్యత్ ఏంటీ.?

BJP In Andhra Pradesh

BJP In Andhra Pradesh

భారతీయ జనతా పార్టీకి ఆంధ్రపదేశ్ రాష్ట్రంపై పెద్దగా ఆశల్లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది కాబట్టి, ఆ పేరు చెప్పి, రాష్ట్రంలో కొంత మేర హడావిడి చేయాలనుకుని, ప్రతిసారీ బోల్తా పడుతూనే వుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ – జనసేనతో కలిసి పనిచేసిన బీజేపీ, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి చావు దెబ్బ తినేసింది. ప్రస్తుతం జనసేనతో బీజేపీ పొత్తు నడుస్తోంది.

బీజేపీకి రాష్ట్రంలో పలువురు ఎంపీలున్నారు.. వాళ్ళంతా రాజ్యసభ సభ్యులే. పైగా, వాళ్ళంతా టీడీపీ నుంచి బీజేపీలోకి దూకేసినవారే. అసెంబ్లీలో బీజేపీకి ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్సీలు వున్నా, అది కూడా చంద్రబాబు హయాంలో టీడీపీ పుణ్యమా అని దక్కిన అవకాశమది. ముందు ముందు బీజేపీ, రాష్ట్రంలో ఎలా తన ఉనికిని చాటుకోగలగుతుంది.? అంటే, సమాధానం నిల్. జనసేనతో పొత్తు వున్నంత కాలం, బీజేపీ కాస్తంత సందడి చేయగలుగుతుంది రాష్ట్రంలో. కానీ, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన పార్టీ, పునరాలోచనలో పడింది.. బీజేపీతో కలిసి కొనసాగడంపై. నిజానికి, జనసేన పోటీ చేయాల్సిన ఉప ఎన్నిక ఇది. ‘మేమే పోటీ చేస్తాం.. మేమే గెలవబోతున్నాం..’ అని ముందే అహంకారం ప్రదర్శించి, మిత్రపక్షానికి సైతం అసహనం కలిగించిన బీజేపీ, బొక్కబోర్లా పడింది ఎన్నికల్లో.

బీజేపీకి పడ్డ ఆ కాసిని ఓట్లు కూడా జనసేనవేని రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. అసలు బీజేపీకి రాష్ట్రంలో ఓటు లేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఒకే ఒక ఆప్షన్ వుంది.. అదే టీడీపీని కలుపుకుపోవడం. ఇప్పటికే ఆ ప్రయత్నాల్ని కమలదళం ప్రారంభించిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోపక్క, బీజేపీతో అంటకాగడం వల్ల ప్రయోజనం లేదన్న అభిప్రాయం రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. అంటే, బీజేపీని అంటరాని పార్టీగా ఇతర పార్టీలు చూసే పరిస్థితి వచ్చేసిందన్నమాట. రాష్ట్రానికి ఏదీ ఇవ్వనంటోన్న బీజేపీకి, రాష్ట్రంలో ఓటు ఎలా దక్కతుంది.? ఛాన్సే లేదన్నది మెజార్టీ అభిప్రాయం. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రంలో కాస్తో కూస్తో బీజేపీకి మైలేజ్ పెరిగే అవకాశం వుంది. కానీ, బీజేపీ అది మాత్రం ఇవ్వదుగాక ఇవ్వదు.