ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ, అక్కడ తమ ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఢిల్లీ మునిసిపల్ పాలనపై పట్టు సాధించాలని, నగర పాలక సంస్థలపై ఆధిపత్యం సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సచ్ దేవా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకుంది. ఇప్పుడు నగర పాలక సంస్థల్లోనూ బీజేపీకి విజయమే లక్ష్యం. దాంతో ఢిల్లీలో ట్రిపుల్ ఇంజిన్ పాలన రాబోతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో జరగనున్న ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ నగర పాలనను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
మొదట డబుల్ ఇంజిన్ పాలనతో బీజేపీ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. ఒక రాష్ట్రానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ప్రచారం చేసింది. ఇప్పుడు అదే నినాదాన్ని మరింత విస్తరించి, మునిసిపల్ పాలనలోనూ తమ పార్టీకి ఆధిపత్యం సాధించాలనే దిశగా ట్రిపుల్ ఇంజిన్ పాలన అనే కొత్త కాన్సెప్ట్‌ను తెచ్చింది.
బీజేపీ వ్యూహం ఎంతవరకు ఫలితమిస్తుందో, ఢిల్లీలో ఆప్ ప్రభావం తగ్గించగలుగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ క్రమంగా నగర పాలనను కూడా తన కిందకు తెచ్చుకుంటే, దేశవ్యాప్తంగా ఇదే మోడల్‌ను అమలు చేయాలని యోచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.