మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుండగా, 2026 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ హాట్ టాపిక్‌గా మారింది.
చిరంజీవి ఈ సినిమాకు రూ.75 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకోనున్నట్లు టాక్. అలాగే, ఆయన కుమార్తె సుస్మిత నిర్మాణంలో భాగమవ్వనుండటంతో ఆమెకు కూడా రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు, వరుస హిట్స్‌తో ఉన్న అనిల్ రావిపూడి రూ.25 కోట్లు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేవలం హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్‌లకే రూ.110 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక ప్రొడక్షన్ ఖర్చులను కలిపితే మొత్తం బడ్జెట్ రూ.200 కోట్లు దాటనుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అయితే, సినిమా కథ ఎలా ఉంటుందనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
కంటెంట్ బాగుంటే వసూళ్లు భారీగా వస్తాయని, లేదంటే భారీ రిస్క్ అవుతుందని చర్చ నడుస్తోంది. అంతేకాకుండా, ఓటీటీ మార్కెట్ కూడా మారిపోవడంతో పెద్ద సినిమాలకు భారీ డీల్స్ లభించడంలో మార్పులు వచ్చాయి. విశ్వంభర సినిమాతోనూ ఇదే పరిస్థితి కనిపించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.