మరాఠా చక్రవర్తి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూసిన అనంతరం మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పాఠ్యపుస్తకాల్లో అక్బర్, ఔరంగజేబుల గురించి మాత్రం వ్రాస్తూ, శంభాజీ మహారాజ్ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
చోప్రా తన పోస్ట్‌లో, “అక్బర్ గొప్ప చక్రవర్తి అని, ఔరంగజేబు పేరు ఢిల్లీలో రహదారికి పెట్టారని తెలుసు. కానీ శంభాజీ మహారాజ్ గురించి ఎందుకు చెప్పలేదు? ఆయన గొప్పతనం స్కూల్ పాఠ్యపుస్తకాల ద్వారా పిల్లలకు ఎందుకు తెలియజేయలేదు?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది చోప్రా వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు దీనిని చర్చగా మార్చొద్దని అంటున్నారు.
ఓ యూజర్ “మీరు చరిత్ర చదవలేదా?” అని ప్రశ్నించగా, చోప్రా స్పందిస్తూ “నాకు చరిత్రలో 80 శాతం మార్కులు వచ్చాయి, నేనెప్పుడూ చరిత్రను నిర్లక్ష్యం చేయలేదు” అని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక ఛావా సినిమా విడుదలైన తొలి రోజే మంచి టాక్ తెచ్చుకుంది. విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో ఒదిగిపోయి తన నటనతో ఆకట్టుకున్నారని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మహారాష్ట్రలో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తుండగా, దేశవ్యాప్తంగా కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.